అర్హులకు పోడు పట్టాల అందించేందుకు పటిష్ట కార్యాచరణ.

రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయల శాఖ మంత్రి కొండా సురేఖ.

పోడు పట్టాల దరఖాస్తుల స్థితిగతుల పై నివేదిక.

పోడు భూముల పట్టా జారీ పై జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యే లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన  మంత్రి కొండా సురేఖ.

తెలంగాణ ప్రభ. (సిరిసిల్ల):  సచివాలయం నుంచి రాష్ట్ర అటవీ , పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కోండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) తో కలిసి  పోడు భూముల పై జిల్లా కలెక్టర్ లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం,  జారీ చేసిన పోడు భూముల పట్టాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నత అధికారులు వివరించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 నాటికి సాగు చేస్తున్న గిరిజనులు, లేదా 13 డిసెంబర్ 2005 నాటికి మూడు తరాలపాటు సాగు చేసిన గిరిజనేతరులకు  పోడు భూముల పట్టా పంపిణి అర్హులని అధికారులు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,30,735 మంది అర్హులను గుర్తించి వారికి 6,69,676 ఎకరాల అటవీ భూమి పట్టాలు పంపిణీ చేశామని అధికారులు తెలిపారు.

మన రాష్ట్రంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన పోడు పట్టాల వివరాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో  సాగు జరుగుతున్న అటవీ భూముల వివరాలతో కూడిన నివేదిక అటవీశాఖ, గిరిజన శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు. 

ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం ప్రకారం గతం నుంచి సాగు చేసుకుంటున్నా అటవీ భూములకు మాత్రమే పట్టాలు అందించాలని, కొత్తగా రాష్ట్రంలో ఇంచ్ అటవీ భూమి కూడా సాగు చేయడానికి వీలు లేదని, అటవీ భూముల సంరక్షణకు అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నూతన ఆక్రమణలు జరగడానికి వీలులేదని మంత్రి స్పష్టం చేశారు.

పెండింగ్ పోడు భూముల పట్టా దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సూచించారు.  ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం అర్హులందరికీ పట్టాలు అందజేయాలని తెలిపారు.  

అటవీ భూముల అనుమతుల కారణంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని,  రోడ్డు సౌకర్యం, త్రాగు నీరు , ఆసుపత్రి వంటి మౌలిక వసతుల కల్పన పనులకు అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ఫాలో అప్ చేయాలని మంత్రి ఆదేశించారు.పట్టాలు మంజూరు చేసిన పోడు భూములలో రైతులు పామ్ ఆయిల్, జీడి మామిడి తోటలు మొదలగు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవసరమైన  సహకారాలు, సూచనలు అందించాలని మంత్రి తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్  ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,  రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల పట్టా కోసం 507 దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పిస్తే కేవలం 27 మందికే పట్టాలు వచ్చాయని , మిగిలిన లబ్ధిదారులకు కూడా పట్టాలు అందేలా చూడాలని ప్రభుత్వ విప్ కోరారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వీర్నపల్లి, కోనరావుపేట చెందుర్తి , గంభిరావు పేట, రుద్రంగి, కోనారావుపేట, ఎల్లారెడ్డి పేట, మండలాల్లోని గిరిజనులకు పోడు పట్టాలు రాలేదని, వీరి దరఖాస్తులను మరోసారి క్షేత్రస్థాయిలో రీ సర్వే నిర్వహించి పట్టాలు పంపిణీ చేయాలని అన్నారు. 

వేములవాడ నియోజకవర్గం పరిధిలో మోత్కరావుపేట ,చందుర్తి రోడ్డు పనులు అటవీ అనుమతుల కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయాయని,  ఈ రోడ్డు నిర్మాణం జరిగితే ఖానాపూర్ నుంచి హైదరాబాదుకు వయ రాయికల్ వెళ్ళడానికి 35 కిలోమీటర్లు మేర ప్రయాణం బారం తగ్గుతుందని అన్నారు. రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో 3.5 కిలోమీటర్లు వేసేందుకు అవసరమైన అనుమతులు త్వరగా అందేలా చూడాలని ప్రభుత్వ విప్ కోరారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీ శాఖ అధికారి బాలామణి ,జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్ధన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.