655 గ్రాముల గంజాయి, మోటార్ సైకిల్, సెల్ ఫోన్ స్వాధీనం
తెలంగాణ ప్రభ (కోరుట్ల): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామ శివారులో సోమవారం సాయంత్రం మోటార్ సైకిల్ పై గంజాయి తరలిస్తున్న ఆలకుంట రాజేష్ అనే యువకుడిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు మెటుపల్లి డీఎస్పీ ఉమామహేశ్వర రావు తెలిపారు. మంగళవారం కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడి వద్ద నుండి 655 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
కోరుట్ల మండలంలోని జోగినిపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట రాజేష్, అలియాస్ చందు, వయసు 19 సంవత్సరాల యువకుడు వడ్డెర కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దాని ద్వారా వచ్చే సంపాదన జల్సాలకు సరిపోక ఇంకా సంపాదించాలనే దురాలోచనతో తక్కువ ధరకు నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి, ఎక్కువ ధరకు అమ్ముకుందామనే ఆలోచనతో రాజేష్ గత కొన్ని రోజులుగా తక్కువ ధరకు గంజాయిని కొని, దానిని కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాలలో గంజాయి తాగే అలవాటు ఉన్న యువతకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తున్నాడు.
సోమవారం రోజు సాయంత్రం రాజేష్ తన వద్ద ఉన్న గంజాయిని కోరుట్ల పట్టణ, పరిసర గ్రామాలలో యువతకు అమ్మడం కోసం తన మోటార్ సైకిల్ మీద వస్తున్నాడని పక్కా సమాచారంతో జగిత్యాల ఎస్పి ఆదేశాల మేరకు మెటుపల్లి డీఎస్పీ ఉమామహేశ్వర రావు పర్యవేక్షణలో కోరుట్ల సిఐ సురేష్ బాబు, ఎస్సైలు ఇ.కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రెండవ ఎస్సై కె.శ్వేత తన సిబ్బంది సాగర్, సత్తయ్య, శ్రీనివాస్, ఎల్లయ్యలతో కలిసి పైడిమడుగు గ్రామ శివారులో నిందితుడిని పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.
అతని వద్దనుండి 655 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పీ ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ కోరుట్ల పట్టణ, పరిసర గ్రామ ప్రజలు ఎవరు కూడా చెడు వ్యసనాలకు మత్తు పదార్ధాలకు బానిస కాకుండా ఉండాలని ఆయన అన్నారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.
ఎవరైనా గంజాయి త్రాగిన, కొన్నా, విక్రయించినాా చట్టరిత్యా కఠిన చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గంజాయి గురించి ఎవరైనా సమాచారం తెలియజేస్తే వారి సమాచారం గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై కె.శ్వేత, పోలీస్ సిబ్బందిని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, మెటుపల్లి డిఎస్పీ ఉమా మహేశ్వర రావు లు అభినందించారు.
ఈ సమావేశంలో కోరుట్ల సిఐ సురేష్ బాబు, ఎస్సైలు ఇ.కిరణ్ కుమార్, కె.శ్వేత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
.