పుట్టిన గంటకే ఇచ్చే ముర్రుపాలతో శిశువుకు బలం.

తెలంగాణ ప్రభ (కోటగిరి): పోతంగల్ మండల కేంద్రంలోని పి.హెచ్.సి. సెంటర్ లో శుక్రవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఐసిడిఎస్ సూపర్వైజర్లు సుమలత, మని ఆధ్వర్యంలో ఆరోగ్య కార్యకర్తలకు, ఆశ వర్కర్లకు అవగాహన సదస్సు కల్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా  సూపర్వైజర్ సుమలత మాట్లాడుతూ... నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు దోహదపడతాయన్నారు. సహజ సిద్ధంగా లభించే పాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయన్నారు. తల్లిపాలలో వివిధ రకాల పోషకాలు ఉంటాయని తెలిపారు. అవి శిశువు పెరుగుదలకు ఉపకరిస్తాయని అన్నారు. తల్లిపాలు ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే అపోహాలు వీడి తప్పకుండా బిడ్డకు పాలు పట్టించాలని, చిన్నపిల్లల వైద్య నిపుణులు బలింతలకు సూచనలు చేస్తారని అన్నారు .పుట్టిన వెంటనే గంటలోపు బిడ్డకు అందించే ముర్రుపాలు సహజ రోగ నిరోధక శక్తి కలిగేలా చేస్తాయని అన్నారు. అందుకే తల్లిపాలను అమృతంతో పోలుస్తారని అన్నారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అపోహలు వీడాలి....

సమాజంలో తల్లిపాలపై ఉన్న అపోహాలు వీడాలి బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంతో పరోక్షంగా తల్లి శారీరకంగా సౌందర్యం దెబ్బతింటుందని మహిళలు అందం తరుగుతుందని అపోహాలు ఉన్నాయి. సహజ సిద్దంగా ఉత్పత్తి అయ్యే తల్లిపాలు బిడ్డకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. డబ్బాపాలతో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగిన మానసికంగా మెరుగైన ఎదుగుదల ఉండదని వైద్యులు చెప్తున్నారని అవగాహన సదస్సులో ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం గౌరీ అంగన్వాడీ టీచర్లు జ్యోతి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.