తెలంగాణ ప్రభ,(తంగళ్ళపల్లి); రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 9 మందికి మరియు గల్లీలో పేకాట ఆడిన ముగ్గురికి మంగళవారం సిరిసిల్ల జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉదయశ్రీ వారందరికీ జరిమానా విధించడం జరిగిందనీ తంగళ్ళపల్లి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. ఇందులో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురికి రూ.1000/- చొప్పున 4 గురికి రూ.1500/- చొప్పున ఒక్కరికీ 2000 రూపాయలు మొత్తం రూ.13000/- రూపాయలు జరిమానా విధించడం జరిగిందని,అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 9 మందికి ఒక్కొక్కరికి రూ.210/- రూపాయలు చొప్పున మొత్తం రూ.1890,/రూపాయలు జరిమానా మరియు గల్లీలో పేకాట ఆడిన ముగ్గురికి 900/- రూపాయలు జరిమానా విధించినట్లు తంగళ్ళపల్లి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. తంగళ్ళపల్లి మండలంలో ఎక్కడైనా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించినా మద్యం సేవించి వాహనాలని నడిపినా, పేకాట ఆడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన చోటనే మద్యం మత్తులో గొడవలు అయ్యి కేసుల పాలవుతున్నారని, అట్లాగే బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన చోట హత్యలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేకాట ఆడడం వలన ఎంతో మంది కుటుంబాలు వీధిన పడుతున్నాయని, భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, ఎవరైనా పేకాట ఆడినా పోలీస్ వారికి నేరుగా లేదా ఢయల్ 100 కి కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన చెప్పారు.
