జర్నలిస్టుపై దాడిని ఖండించిన మన ప్రెస్ క్లబ్ కోరుట్ల పాత్రికేయులు

తెలంగాణ ప్రభ (కోరుట్ల): ఉస్మానియా యూనివర్సిటీలో  నిరుద్యోగుల ప్రధాన సమస్యలపై విద్యార్థులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన జీ తెలుగు పాత్రికేయుడు శ్రీ చరణ్ పై ఒక హుందాగల వృత్తిలో కొనసాగుతున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ చట్టవిరుద్ధంగా చేసిన దాడిని కోరుట్ల మన ప్రెస్ క్లబ్ తీవ్రంగా ఖండించింది.  శుక్రవారం కోరుట్ల పట్టణంలోని మన ప్రెస్ క్లబ్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు అరికట్టవలసిన బాధ్యత ముఖ్య మంత్రిపై సంబంధిత మంత్రులు, అధికారులపై ఉందని మన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉరుమడ్ల శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు  స్పష్టం చేశారు. 

సమాజానికి నాలుగు స్తంభాలుగా వ్యవహరించి పాత్రికేయ వృత్తిని ఎవరైనా గౌరవించవలసిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఇచ్చిన హక్కులను కాపాడే బాధ్యత కలిగిన నాయకులు, పోలీసులు ఇలా వ్యవహరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న పాత్రికేయులపై ఇలాంటి దాడులకు పాల్పడడం  పిరికి పంద చర్య అవుతుందని పేర్కొన్నారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో మహిళా జర్నలిస్టుపై, గాంధీ ఆసుపత్రిలో కవరేజ్ కి వెళ్ళిన వీడియో జర్నలిస్టుపై అకారణంగా జర్నలిస్టులపై దాడికి పాల్పడిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ పై, ఇతర జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై చట్టారీత్యా తగు చర్యలు తీసుకోవాలని మన ప్రెస్ క్లబ్ కోరుట్ల పక్షాన డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో మన ప్రెస్ క్లబ్ పాత్రికేయులు కత్తిరాజ్ శంకర్, వనతడుపుల నాగరాజు, దయా మదన్, మంచికట్ల విజయ్, చింతాజీ రాధాకృష్ణ, కోడూరి ప్రేమ్ కుమార్, చిట్యాల గంగాధర్, జాగిలం కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

.