తెలంగాణ ప్రభ (కోరుట్ల): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నూతన నేర చట్టాలపై మెట్ పల్లి పట్టణంలోని వెల్లుల రోడ్ లో గల విదిత్ ఫంక్షన్ లోని న్యాయవాదులకు, పోలీసులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యాయవాదులకు మరియు పోలీసు సిబ్బందికి రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి మరియు చైర్మన్ ఫర్ స్టేట్ ల్యాండ్ అక్విసేషన్ ట్రిబ్యునల్ అజిత్ సింహ రావు కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సన్నిహిత, నాగరిక్ సురక్షా సన్నిహిత మరియు సాక్ష్య అధినియం చట్టాలు పోలీసులకు, న్యాయవాదులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. నిందితులకు శిక్షలు పడటంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ సులభతరం చేసేలా ఆడియో, వీడియో, మొబైల్ టెక్నాలజీ వాడేందుకు కొత్త చట్టాలు ఎంతో వెసులుబాటు కల్పించాయన్నారు.
తప్పు చేసిన నిందితులు కోర్టు శిక్షల నుండి తప్పించుకుపోలేరన్నారు. తక్కువ టైంలోనే కేసుల్ని విచారించడం వలన కేసుల పెండెన్సీ కూడా తగ్గుముఖం పడుతుందని నీలిమ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెట్ పల్లి డీఎస్పీ ఉమా మహేశ్వరరావు,కోరుట్ల,మెట్ పల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాస్ రావ్,పుప్పాల లింబాద్రి,ప్రధాన కార్యదర్శులు సుతారి శ్రీనివాస్,తునికి వేణుగోపాల్,న్యాయవాదులు జిల్లా వెంకటేశ్వర్లు,వడ్డేపల్లి శ్రీనివాస్ మరియు కోరుట్ల, మెట్ పల్లి బార్ సభ్యులు పాల్గొన్నారు.
.