ఏబిసిడి వర్గీకరనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ పోరాటం

కుత్బుల్లాపూర్ లో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): మాదిగలకు జనాభా ప్రాతిపదికన 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని లక్ష్యంతో ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని మాదిగ జర్నలిస్ట్ ఫోరం జాతీయ నాయకులు ముక్కెర్ల లాలయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల బాబు అన్నారు. ఎమ్మార్పీఎస్ 30 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సాయి నగర్ లో  ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడే సంజీవ  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ అంతిమ లక్ష్యం మాదిగలకు వారి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, ఇతర అవకాశాలను భారత రాజ్యాంగం కేటాయించిన రిజర్వేషన్ల ప్రాధిపదికన అందించాలని సంకల్పంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేపడుతున్న పోరాటం న్యాయపరమైందన్నారు. 30 ఏళ్ల ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ పోరాటంలో వికలాంగులు వృద్ధులు పొందుతున్న పెన్షన్లతో పాటు అనేక సామాజిక కార్యక్రమాల్లో ఎమ్మార్పీఎస్ పోరాటం సత్ఫలితాలను ఇచ్చిందన్నారు.  అధికార ప్రభుత్వాలు తమ ఉనికిని చాటుకునేందుకు మాదిగలను కేవలం ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకుందే తప్ప వారికి చెందాల్సిన సంక్షేమ పథకాలను ఇతర అవకాశాలను అమలుపరచడంలో పూర్తిగా విఫలమైందని  విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఎన్నికల ముందు మాదిగలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్లమెంటులో ఏబిసిడి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి 12% రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటకు కట్టుబడిగా ఉండేలా వచ్చే పార్లమెంటు సమావేశాలు ఏబిసిడి వర్గీకరణ ఆమోదించి అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మోడీ  ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగాలని,  మాదిగల ఆత్మగౌరవాని, ఆత్మస్థైర్యాన్ని  పరీక్షించరాదని  హితవు పలికారు. గత ప్రభుత్వాలు మాదిగల ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కాయాని ఇదే కనుక పునరావృతమైతే మాదిగల తిరుగుబాటు కొత్తేమీ కాదని హెచ్చరించారు. ఏబిసిడి వర్గీకరనే అంతిమ లక్ష్యంగా సాగుతున్న ఉద్యమంలో మాదిగలు ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా మేడ్చల్ జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు జి. మల్లికార్జున్ ఎం.శ్రీను, బీ ఆర్ ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబ శివా రెడ్డి, కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు జలగం చంద్రయ్య, కార్యకర్తలు భారతి, లక్ష్మి, జహంగీర్, ఉప్పలయ్య, ఏం.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

.