సమస్యలపై అధికారులను ప్రశ్నించిన సభ్యులు
కాంగ్రెస్ లో జరుగుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం లేదని అధికారులపై మండిపాటు
తెలంగాణప్రభ, (తంగళ్ళపల్లి); తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పడిగల మానస అధ్యక్షతన నిర్వహించిన చివరి మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. గ్రామాల్లోని పలు సమస్యలపై సభ్యులు అధికారులను ప్రశ్నించారు. సమస్యలను చెప్పుకోవడం తప్ప అధికారులు సమస్యలను పరిష్కరించడం లేదని మండిపడ్డారు. చిన్న లింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ఆగ్రహించారు. చిన్న లింగాపూర్ కు బస్సుల సంఖ్య పెంచాలని ఆర్టీసీ డిపో అధికారిని ప్రశ్నించగా డిపోకు వచ్చే అర్జీ పెట్టుకోవాలని చెప్పడంతో, అలాంటపుడు మీరు ఎందుకు సమావేశానికి వచ్చారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు గ్రామాల్లోని సమస్యలపై ప్రశ్నించగా సంబంధిత అధికారులు సమాధానం ఇచ్చారు. మండల అభివృద్ధికి హలో అంశాలపై చర్చించారు.అనంతరం ఎంపీపీ పడిగల మానస మాట్లాడుతూ... గత ఐదు ఏళ్లుగా మండల ఎంపీపీగా మండల అభివృద్ధికి ఎన్నో సేవలు చేశానని, ప్రజాసేవలో భాగస్వామినైనందుకు సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశానన్నారు. ఇలాంటి అవకాశం కల్పించిన మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు ప్రజా ఆశీర్వాదం ఉంటే రాజకీయాల్లో కొనసాగుతానన్నారు. ఐదేళ్ల కాలంలో సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జోగం రాజు,పాక్స్ చైర్మన్లు బండి దేవదాస్, కోడూరి భాస్కర్, ఎంపీటీసీలు, మరియు అధికారులు పాల్గొన్నారు.
