చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి శ్రీరామ కుంట చెరువును అధికారులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద  పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద మాట్లాడుతూ మనిషి ప్రకృతితో మమేకమై జీవించినప్పుడే మనుగడ సాధ్యమని, భూమిలో నీటి నిల్వలు పడిపోకుండా ఉండాలంటే చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ఇటు ప్రజా ప్రతినిధులతోపాటు, అధికారులు, ప్రజలపై ఉందన్నారు. గతంలో నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లేఔట్ అంటే ముంపుకు గురయ్యే ప్రాంతంగా ముద్రపడిందని కానీ గత పదేళ్ల కాలంలో ఎంతో ప్రణాళిక బద్ధంగా పనిచేస్తూ వరద ముంపును తొలగించడంతో నేడు ఇక్కడి ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే ప్రజా ప్రతినిధులుగా మేము సంతోషంగా ఉంటామన్నారు. ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి తుర్క చెరువు, జంగారి కుంట, శ్రీరామ కుంట, ఎల్లం బాయి కుంటలకు సరిహద్దులను నిర్ణయించి చెరువు ఆక్రమణకు గురికాకుండా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో మరిన్ని నిధులతో చెరువులను ఆహ్లాదభరితంగా తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. 


ఈ కార్యక్రమంలో బాచుపల్లి ఎమ్మార్వో పూల్ సింగ్, మున్సిపల్ కమిషనర్ పి.రామకృష్ణారావు, డిఈలు దాసయ్య, శ్రీనివాస్, ఏఈఈ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు జ్యోతి నరసింహారెడ్డి,  ప్రణయ ధనరాజ్ యాదవ్, కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అభిషేక్ రెడ్డి, బండారి లేఔట్ అధ్యక్షులు నరసింహారెడ్డి, స్థానిక నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

.