తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) ఓటు మనం వేయడంతో పాటు పదిమందితో వేయించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోగులపాటి కృష్ణమోహన్, పిలుపునిచ్చారు.
ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో గాజులరామారం హెచ్ ఏ ఎల్ కాలనీ వసుదైక నిలయంలో ప్రముఖ న్యాయవాది ఉప్పల అనిల్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యం ఓటు ప్రాముఖ్యత అనే కార్యక్రమంలో గోగులపాటి కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ మానవుని మనుగడకు ఓటు అనగా ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రజాస్వామ్యంలో మన భవిష్యత్తుకు ఓటు కూడా అంతే అవసరమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరోజు ఆ ఒక్క రోజు బద్ధకాన్ని విడనాడి తాము ఓటు వేయడంతో పాటు ఇతరులతో కూడా ఓటు వేయించేలా కృషి చేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు సర్వేపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ ఓటు వేసిన వారికే ప్రభుత్వం అందించే ఉచిత పథకాలు అందే విధంగా చట్ట సవరణలు తీసుకువస్తే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ఓటు హక్కు వినియోగించుకునేలా బాధ్యత వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు, కార్పొరేటర్ రావుల శేషగిరి అన్నావజ్జుల సూర్యప్రకాశరావు, కో కన్వీనర్ నిరంజన్ దేశాయ్, దండిగం సుధాకర్ శర్మ ప్రభృతులు పాల్గొని ఓటు విలువ ఓటర్ల చైతన్యంపై ప్రసంగించారు.
అనంతరం శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవ సంఘం ముద్రించిన శ్రీ క్రోధి నామ సంవత్సరం పంచాంగాలను అతిధులకు అందించారు.
.