మల్కాజిగిరిలో బిజెపి నుంచి పోటీ చేసేందుకు ఈటెలను మించిన నాయకుడు లేడా? బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి లక్ష్మారెడ్డి

కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరి ప్రజలు ఆదరిస్తే నియోజకవర్గానికి చేసింది ఏమిటి?

తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): దుండిగల్ మున్సిపాలిటీ బహదూర్ పల్లి లోని ఎంఎం గార్డెన్స్ నందు నిర్వహించిన దుండిగల్ మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద  ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి  మాట్లాడుతూ కొడంగల్ లో ఓడిన రేవంత్ రెడ్డిని మల్కాజ్గిరి ప్రజలు ఆదరించి ఎంపీని చేస్తే, నియోజకవర్గంలోని ఏ ఒక్క ప్రాంతంలో ఒక్క రూపాయి కేటాయించకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లి అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఇక బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ను మించిన నాయకుడు మల్కాజిగిరిలో లేడా, పార్టీ కోసం మొదటినుంచి పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కనిపించలేదా ,అని ప్రశ్నించారు. గజ్వేల్, హుజురాబాద్ లో గెలవనోళ్లు, మల్కాజిగిరిలో గెలుస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

అనంతరం ఎమ్మెల్యే కేపీ వివేకానంద  మాట్లాడుతూ జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో అయ్యేది ఏమీ లేదని, ఇందుకు నిదర్శనమే గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డియేనన్నారు. ఆయన ఎంపీగా గెలిచి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, అసలు మల్కాజ్గిరి ఎంపీ అయినందుకే నేడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యాడని, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారో ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇలాంటి నాయకుల మార్గదర్శకత్వంలో ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్, బిజెపి పార్టీల నాయకులు భవిష్యత్తులో ఏదో చేస్తారనే ఆశతో ప్రజలు లేరని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి అయిన రాగిడి లక్ష్మారెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించేలా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో దుందిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు, దుండిగల్ మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవరెడ్డి, కౌన్సిలర్లు శంబీపూర్ కృష్ణ, బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, మాజీ జిల్లా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రవీందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

.