తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్) పద్య సారస్వత పీఠం తెలంగాణ ఆధ్వర్యంలో క్రోధి ఉగాది వేడుకల్లో భాగంగా శతపద్య కవి సమ్మేళనం ఆదివారం రవీంద్రభారతిలో కన్నులపండువగా జరిగింది.
పద్యాన్ని ఆత్మీయంగా అభిమానించే వారందరి కోసం, పద్యాన్ని నిరంతరం పరిరక్షిస్తున్న వారందరి కోసం పద్యం సామాజిక చైతన్యం కోసమేనని పరితపించే వారి కోసం, పద్యసేద్యం చేస్తున్న కృషీవలురను ఒక్క వేదికపై చేర్చడం కోసం, పద్యానికి పట్టాభిషేకం చేసి మనఃఫలకాలపై ప్రతిష్ఠించడం కోసం,శాశ్వత పద్య భాండాగారాన్ని నెలకొల్పడం కోసం ఏర్పడ్డదే పద్య సారస్వతపీఠం అని పీఠం అధ్యక్షుడు అవుసుల భాను ప్రకాష్ పేర్కొన్నారు.
మొత్తం నూటా ఎనిమిది మంది పద్య కవులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు, నా ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోగులపాటి కృష్ణమోహన్ పన్నెండు మంది కవులలతో కూడిన మొదటి ఆవృతానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గోగులపాటి కృష్ణమోహన్ పద్యసారస్వత పీఠం పై సీసపద్యం వ్రాసి ఆలపించారు. అనంతరం అతిధుల చేతులమీదుగా సన్మానించారు.
అష్టావధాని పీఠం అధ్యక్షుడు అవుసుల భాను ప్రకాష్ రచించిన శ్రీ రామాయణ భానువు పుస్తకాన్ని ఆచార్యులు కసిరెడ్డి వెంకటరెడ్డి, ఆకెళ్ళ రాఘవేంద్ర, ఈస్ట్ జోన్ డిఎస్పి రావుల గిరిధర్, సివిఎల్ నర్సింహారావు, ఆచార్య ఫణీంద్ర, శివారెడ్డి, మరుమాముల దత్తాత్రేయ శర్మ, రావికంటి శ్రీనివాస్, అర్ధచంద్ర ప్రకాశ్ రెడ్డి ప్రభృతులు పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వక్తలు శ్రీరాముని గొప్పతనం గురించి వివరిస్తూ రాముని దేవునిగా కాకుండా ఒక ఆదర్శమూర్తిగా కొలవాలని ఆయన మార్గాన్ని అనుసరించాలని అప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. భావితరాలకు రామాయణ విశిష్టతను తెలియజేయడంతో పాటు పిల్లలు దానిని అనుసరించేలా ప్రతి ఒక్కరు ప్రత్యేక బాధ్యత చేపట్టాలని సూచించారు.
అనంతరం అతిధుల చేతులమీదుగా శతాదిక కవులను శాలువా, మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి సుమారు వందకు పైగా కవులు పాల్గొని ఉగాది ప్రాశస్త్యాన్ని, రామాయణ ప్రాముఖ్యత పై పద్యాలు ఆలపించి సభికులను అలరించారు.
.