చెరువుల సంరక్షణ సమితి నాయకులు
తెలంగాణ ప్రభ (కుత్బుల్లాపూర్): బెంగళూరు పట్టణంలో చెరువులను, కుంటలను కబ్జా పూడ్చి అక్రమంగా నిర్మాణాలను చెయ్యడం వల్ల నేడు నీటి కొరతతో బాధపడుతున్న విషయం మన అందరికి తెలిసిందేనని, అలాంటి పరిస్థితులు మన దగ్గర ఏర్పడకుండా జాగ్రత వహిస్తేనే రాబోవు తరాలకు నీటి సమస్య లేకుండా చేయవచ్చని కావున కుత్బుల్లాపూర్, హైదరాబాద్ లో విస్తరించి ఉన్న చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పై ఉందని తెలియచేస్తూ మన హైదరాబాద్ ను మరో బెంగళూరు చేయవద్దని నేడు స్థానికులతో కలిసి కుత్బుల్లాపూర్,జగతగిరిగుట్ట లో ఉన్న పరికి చెరువు వద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఐ కార్యదర్శి ఉమా మహేష్, సామాజిక యువ నాయకులు సాయి పంతుల మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి మండలంలో సుమారు 112 ఎకరాల్లో పరికి చెరువు విస్తరించి ఉండేదని కానీ నేడు చెరువును స్థానిక నాయకులు కోర్ట్ ఆర్డర్ పేరిట చెరువులను కబ్జా చేసి ఆమాయకులకు లక్షల్లో అమ్ముకుంటు మోసం చేస్తున్నారని ,గతంలో ఇక్కడ అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తే మళ్ళీ నేడు అక్కడే నిర్మాణాలను చేసారని,అదే కాకుండా అన్ని వైపులా నుండి చెరువును పూడ్చుకుంటు వస్తున్నారని,అధికారులు ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే ఉన్న చెరువు మొత్తం అదృశ్యం అయ్యి చరిత్రలో చూడాల్సి వస్తుందని కావున అధికారులు కండ్లు తెరిచి చూసి చెరువులను కాపాడాలని కోరారు. ఒకవేళ అధికారులు చర్యలు తీసుకోకపోతే రాజకీయాలకు అతీతంగా అందరిని కలుపుకొని కాపాడుకుంటామని, అవసరమైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్,సుప్రీంకోర్టు వరకు వెళ్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు హరినాథ్,శ్రీనివాస్, సదానంద్, సహదేవరెడ్డి, వెంకటేష్, ఇమామ్,విక్రమ్,శివ,ఇమామ్ తదితరులు పాల్గొన్నారు.
.