ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు

సారంపల్లిలో ఎండిన పంటల పరిశీలన

రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి

మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్

తెలంగాణ ప్రభ, (తంగళ్ళపల్లి); ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ముమ్మాటికి కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. గురువారం తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను ఎమ్మెల్యే కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతులకు చేస్తానన్నా రుణమాఫీ చేయలేదు కదా, బ్యాంకుల ద్వారా నోటీసులు ఇప్పిస్తూ రైతుల మెడ పైన కత్తి పెట్టి రుణాలు కడతారా చస్తారా అన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అని, రైతులను చూస్తే నిజంగానే బాదేస్తుందని ఆయన అన్నారు. ఎండిపోయిన 15 లక్షల ఎకరాలను రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. మేడిగడ్డ వద్ద కుంగిపోయిన మూడు పిల్లర్ల వద్ద కాపర్ డామ్ కడితే అయిపోయేది అని, కౌలు రైతులు, రైతులకు చేస్తానన్న లబ్ది వెంటనే చేకూర్చాలన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఢిల్లీకి జాతరలు, యాత్రలు తప్పితే రాష్ట్రానికి సీఎం రేవంత్ చేసిందేమీ లేదని ఆయన అన్నారు. రైతులు ఆత్మహత్యలు లాంటి చర్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలని, బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

.