మెద‌క్‌లో మిగిలింది కాంగ్రెస్ అభ్య‌ర్థే..!

బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా మాజీ క‌లెక్ట‌ర్ వెంక‌ట్రాంరెడ్డి

బీజేపీ అభ్య‌ర్థిగా ర‌ఘునంద‌న్‌రావు

తెర‌మీదికి విజ‌య‌శాంతి పేరు..?

ప‌రిశీలిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం..

సామాజికవ‌ర్గానికి కేటాయిస్తే నీలం మ‌ధుకు అవ‌కాశం

తెలంగాణ ప్ర‌భ ( ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో ): ఎంతో ఉత్కంఠ‌కు తెర‌దీసిన మెద‌క్ పార్ల‌మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి ఎంపిక ఎట్ట‌కేల‌కు డిక్లేర్ అయింది. ఎన్నో ప‌ర్యాయాలు చ‌ర్చ‌ల అనంత‌రం మాజీ క‌లెక్ట‌ర్‌, ఎమ్మెల్సీ వెంక‌ట్రాంరెడ్డికి అధిష్టానం టికెట్టు ఖ‌రారు చేసింది. ఒక‌ద‌శ‌లో మెద‌క్ నుండి మాజీ సీఎం కేసీఆర్ లేదా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్‌రావు బ‌రిలో ఉండే అవ‌కాశం ఉంద‌ని భావించారు. అయితే అధినేత కేసీఆర్‌తో హ‌రీష్‌రావు సుదీర్ఘంగా చ‌ర్చించి వెంక‌ట్రాంరెడ్డి పేరును ఖ‌రారు చేయించారు. మొద‌ట్లోనే కేసీఆర్‌కు స‌న్నిహితుడైన వెంక‌ట్రాంరెడ్డిని బ‌రిలో దింప‌నున్నార‌ని ప్ర‌చారం సాగిన‌ప్ప‌టికీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా గ‌జ్వేల్‌కు చెందిన వంటేరు ప్ర‌తాప్‌రెడ్డి పేరు దాదాపుగా ఖ‌రారైనంత ప్ర‌చారం సాగింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో గెలుపే ల‌క్ష్యంగా మెద‌క్ సీటును పొందేందుకు అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హ‌రీష్‌రావు తుద‌కు వెంక‌ట్రాంరెడ్డికి ఖ‌రారు చేశారు. ఇప్ప‌టికే మెద‌క్ స్థానానికి బీజేపీ అభ్య‌ర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం.ర‌ఘునంద‌న్‌రావు పేరు ఖ‌రారైన విష‌యం తెలిసిందే. ఎలాగైనా మెద‌క్ సీటును కైవ‌సం చేసుకోవాల‌నే ల‌క్ష్యంతో బీఆర్ఎస్ అధిష్టానం అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో ఆచితూచి అడుగులు వేసింది. చివ‌ర‌కు వెంక‌ట్రాంరెడ్డినే అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. 


కాంగ్రెస్ టికెట్టు ఎవ‌రికో...


మెద‌క్ పార్ల‌మెంట్ స్థానానికి బీజేపీ, బీఆర్ఎస్ అభ్య‌ర్థులు ఖ‌రారైన నేప‌థ్యంలో మిగిలిన ప్ర‌ధాన పార్టీ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎవ‌ర‌నే దానిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. రెండు పార్టీల‌కు  అభ్య‌ర్థులు ఖ‌రారు కావ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన కాంగ్రెస్ గెలిచే స‌త్తా ఉన్న‌నేత‌ను బ‌రిలోకి దించాల‌ని యోచిస్తోంది. అందులో భాగంగానే టికెట్టు ఆశిస్తున్న మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు, నీలం మధు ఇద్ద‌రిలో ఎవ‌రికో ఒక‌రికి టికెట్టు కేటాయించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌పై అంత‌గా దృష్టి సారించ‌డం లేద‌న్న ప్రచార‌మూ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల‌కు చెందిన ఇద్ద‌రు అభ్య‌ర్థులు ఓసీ కేటగిరీకి చెందిన వారు కావ‌డంతో కాంగ్రెస్ పార్టీ అదే కేట‌గిరికి చెందిన వారికే కేటాయిస్తుందా లేక బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన నీలం మ‌ధుకు కేటాయిస్తుందా అనేది  సందిగ్ధంగా మారింది. ఒక‌వేళ సామాజిక వ‌ర్గానికి కేటాయిస్తే నీలం మ‌ధు బ‌రిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. 

మెద‌క్ నుంచి "రాముల‌మ్మ" పోటీ..?

ఇలావుండ‌గా మెద‌క్ పార్ల‌మెంట్ స్థానం నుండి మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజ‌య‌శాంతి బ‌రిలో ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. గ‌తంలో టీఆర్ఎస్ నుండి మెద‌క్‌ ఎంపీగా ఐదేళ్ళ‌పాటు కొన‌సాగిన విష‌యం తెలిసిందే. త‌ద‌నంత‌రం జ‌రిగిన రాజ‌కీయ మార్పుల కార‌ణంగా ఆమె టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె మెద‌క్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తార‌ని భావించారు. కానీ ఆమె అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేదు. ప్ర‌స్తుతం మెద‌క్ సీటుపై ప్ర‌ధాన పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో గ‌త అనుభ‌వం ఉన్న విజ‌య‌శాంతిని బ‌రిలోకి దించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్న‌ట్లు స‌మాచారం. ఏదిఏమైనా కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎంపిక‌లో నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డాలంటే హోలీ పండ‌గ త‌ర్వాతే స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆ పార్టీ నేత‌లు ప‌లువురు చెబుతున్నారు.

.