
ఉమ్మడి మెదక్ జిల్లాపై "హస్తం" నజర్ ?
కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్లు ప్రచారం
ప్రెస్‌మీట్లు పెట్టి మరీ వివరణ ఇస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
అంతర్మథనంలో కార్యకర్తలు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత బీఆర్ఎస్, బీజేపీల నుండి వలసల పర్వం మొదలైంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు పలువురు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ వలసలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. మేలో జరిగే పార్లమెంట్ ఎన్నికల లోపు సాధ్యమైనంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ఓ సభలో తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వెళ్ళిన సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అధిష్టాన పెద్దలతో జరిపిన చర్చల్లో వలసలపై దృష్టిసారించాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏడు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొంది బలంగా ఉంది. సిద్దిపేట నుండి హరీష్‌రావు, గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ మినహాయిస్తే మిగతా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నజర్ పెట్టినట్లు సమాచారం. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఫిరాయింపులకు పాల్పడితే ఎలా అనే మీమాంసలో బీఆర్ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు కాంగ్రెస్‌లోకి వెళ్లున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. అయితే తాము ఎట్టి పరిస్థితిలో పార్టీ మారే ప్రసక్తి లేదని ప్రెస్‌మీట్లలో సదరు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి మెదక్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా మాత్రం అర్థమవుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్‌రెడ్డి ఎన్నికైన తర్వాత ఉమ్మడి జిల్లా నుండి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను ప్రత్యేకంగా కలవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. వారు పార్టీ మారుతున్నారన్న ప్రచారం జోరుగా కొనసాగింది. అయితే తాము మర్యాద పూర్వకంగా నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని సీఎంను కలిశామని ప్రెస్‌మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ ఇతర జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతుండడం, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరి టికెట్టు తెచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం పూర్తి స్థాయిలో గేట్లు తెరుస్తామని, త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. తాజాగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడికి చెందిన క్వారీలపై దాడులు చేసి సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని..లేనిపక్షంలో కేసులు, దాడులు చేపడుతామని కాంగ్రెస్ బెదిరిస్తుందని ఆరోపించారు. దీనిబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికి పథకం ప్రకారమే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతర్మథనంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ?
రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు అంతర్మథనంలో పడినట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో అధికారం లేకపోవడం..తమ పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీలు మారుతుండడంతో రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఏం నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని మనోవేధనకు గురవుతున్నట్లు ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపువస్తే పార్టీ మారాలనే ఆలోచనలో కూడా కొందరు ఎమ్మెల్యేలు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారం కూడా ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు పార్టీని అప్రతిష్టపాలు చేస్తుందని భావిస్తున్నారు. అంతేగాకుండా ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్పించేందుకు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఇలావుండగా పార్టీ మారుతున్నారన్న ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం..అది నిజం కాదని బీఆర్ఎస్ అధిష్టానంకు వివరణ ఇవ్వలేక నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిస్థితి అటు కక్కలేక...ఇటు మింగలేని దుస్థితి దాపురించిందని చెవులు కొరుక్కుంటున్నారు.
