ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలి

ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి 

అధికారుల పని తీరుపై  అసహనం 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ రాజ్, ఇరిగేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  రెవెన్యూ, నీటి పారుదల శాఖ   ఇంజనీరింగ్ అధికారులు, మునిసిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బముగా జిల్లాలోని   సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారం తదితర మండలాల్లో చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి వాటి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చెరువులు, కుంటలు, ఎఫ్టిఎల్ పరిధిని అధికారులు సర్వే చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పటాన్చెరు, జిన్నారం, సంగారెడ్డి తదితర మండలాలలోని పెద్ద చెరువుల రికార్డులను వెంటనే సమర్పించాలని రెవెన్యూ,  ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు. మైనింగ్ అనుమతులకు రెవెన్యూ అధికారులు ఎన్వోసీ తప్పనిసరి అన్నారు. అనుమతి పొందిన మేరకే మైనింగ్ జరిగేలా అధికారులు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బొల్లారం ఎర్రగుంట చెరువులో ఏర్పాటుచేసిన వెంచర్ వివరాలు వెంటనే ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు . 

ధరణి సమస్యలను పరిష్కరించాలి 

ధరణి పెండింగ్ సమస్యలను రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలని  తెలిపారు. గ్రామస్థాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమణ కాకుండా ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు చూడాలన్నారు.  పల్లె ప్రకృతి వనాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు గ్రామస్థాయిలో కాపాడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనన్నారు.   మునిసిపల్ అధికారులు  నోటీసులు మాత్రమే ఇచ్చి కూర్చుంటారని..చర్యలు మాత్రం చేపట్టరని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ పద్మజారాణి , డిపిఓ సాయిబాబా, నీటి పారుదల శాఖ ఎస్ఈ మురళీధర్, ఆర్డీఓ వసంత కుమారి, సంబంధిత  మండలాల తహసీల్దారులు,  సిబ్బంది పాల్గొన్నారు.

.