ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు ప్రారంభం

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని బాలికల ఉన్నత పాఠశాల, ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,  ఎస్పీ చెన్నూరు రూపేష్ లు తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలలో భద్రత ఏర్పాట్లను, పరీక్ష రాయడానికి వచ్చిన విధ్యార్థులకు ఉండవలసిన తాగునీటి సదుపాయం, అత్యవసర మెడికల్ సేవలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం జారీచేసిన పరీక్షల నిర్వాహణ గైడ్ లైన్స్ పాటిస్తూ, విధ్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి కావలసిన అన్నిరకాల ఏర్పాట్లను కల్పించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ   జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుంటుందని, పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర ఉన్నటువంటి అన్ని జిరాక్స్ సెంటర్స్ మూసివేయాలని ముందుగానే నోటీసులు జారీ చేసి, మూసివేయించడం జరిగిందని చెప్పారు. విద్యార్థులకు, ఇన్విజిలేటర్స్, ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్స్ ఎవ్వరికి కూడా పరీక్ష కేంద్రంలోనికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావడానికి అనుమతులు లేవన్నారు. పరీక్షా కేంద్ర వద్ద ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లైతే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు.

తెలంగాణ రాష్ట రోడ్డు రావాణ శాఖ ఆద్వర్యంలో 10వ తరగతి పరీక్ష రాయడానికి వస్తున్న విధ్యార్థిని, విధ్యార్థులకు కల్పించిన ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దేవదాస్, విద్యాశాఖ సంబంధిత అధికారులు  కే.శ్రీనివాస్ చార్యులు, విజయ భాస్కర్ పాల్గొన్నారు.

.