పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలి

మెదక్ జిల్లా ఎన్నికల  అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం సాధారణ పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మెదక్ పార్లమెంట్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ లో జిల్లా ఎస్పీ బాలస్వామితో  కలిసి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26 న నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు. మెదక్  పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరువు, దుబ్బాక, గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో తుది ఓటరు జాబితా ప్రకారం 18 లక్షల 12 వేల 858 మంది ఓటర్లు ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరి చూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు ఏప్రిల్ 15 వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తయిందని, పోలింగ్ సిబ్బంది మొదటి, రెండవ, తుది రాండమైజేషన్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మొత్తం ఎన్నికల సిబ్బంది  తీసుకొని చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందని అన్నారు.  రాజకీయ పార్టీలకు,  నాయకులకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదని అన్నారు. రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్  ద్వారా సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని, సి -విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన 100 నిమిషాల గడువులోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంగిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. 

ఎస్పీ బాలస్వామి  మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో నాలుగో విడతలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. 

అక్రమ నగదు, లిక్కర్ సరఫరా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో అవసరమైన మేర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, 24 గంటలపాటు గట్టి నిఘా ఉంచామని తెలిపారు.  

ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50 వేలకు మించి నగదు తో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు  పాల్గొన్నారు.

.