మహిళా ఉద్యోగుల పనితీరు ఆదర్శనీయం : మెద‌క్‌ అదనపు కలెక్టర్ రమేష్

తెలంగాణ ప్ర‌భ (మెద‌క్‌): మ‌హిళా ఉద్యోగుల ప‌నితీరు ఆద‌ర్శ‌వంత‌మైంద‌ని మెద‌క్ జిల్లా అద‌న‌పు క‌లెక్ట‌ర్ ర‌మేశ్ కొనియాడారు. బుధ‌వారం జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఆర్ఓ పద్మశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ నిర్మల, టీఎన్జీవో అధ్యక్షులు నరేందర్, ఎస్సీ అభివృద్ధి అధికారిని విజయలక్ష్మి, జిల్లా సహకార అధికారిని కరుణ, మెప్మా పీడీ ఇందిర, ఇమ్యునైజేషన్ అధికారి మాధురి, ఆర్టిసీ డీఎం సుధ, సంబంధిత అధికారులతో  అదనపు కలెక్టర్ హాజరై ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని, అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పారు. మహిళలు ఆర్థిక పెట్టుబడితో పాటు విద్య, ఉన్నత విద్య, ఆరోగ్యపరంగా పెట్టుబడులు పెట్టి  సమగ్ర అభివృద్ధి చెందాలన్నారు. జిల్లాలో మహిళా అధికారుల సహాయ సహకారాలతో అభివృద్ధి పథంలో వెళ్తుందన్నారు.                 బాలికలను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలని, బాలికలకు ఉమ్మడి కుటుంబాల మానవతా విలువలు నేర్పించాలని,  విద్యార్థి దశ నుంచి కంటికి రెప్పలా తల్లిదండ్రులు కాపాడుకోవాలని తెలిపారు. బాలికలు గాని మహిళా ఉద్యోగులు గాని రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు ఆత్మరక్షణకై భద్రత మేరకు పోలీసు సహాయం తీసుకోవాలని మహిళలు, బాలికలు ఆత్మరక్షణకై ప్రమాదకరమైన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం కంటే శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదని చెప్పారు. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యపడుతుందని కొనియాడారు.

అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ మహిళలను రక్షించడానికి షీ టీమ్స్ ఎల్లవేళలా పనిచేస్తాయని, ఎటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడినా 100  నెంబర్ కి ఫోన్ చేసి వారు రక్షణ పొందాలని, పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని వివరించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపించిన మహిళా ఉద్యోగినులకు శాలువాలు మెమొంటోలతో సత్కరించారు. ఆర్టీసీ డీఎం సుధ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగినుల ఆటలు అలరించాయి.

.