జ‌హీరాబాద్‌లో ట్ర‌యాంగిల్ పోరు..!

బీజేపీ అభ్య‌ర్థిగా బీబీ పాటిల్‌

కాంగ్రెస్ అభ్య‌ర్థిగా సురేశ్ షెట్కార్‌

బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గాలి అనిల్‌కుమార్

తెలంగాణ ప్ర‌భ ( ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో ): ఏప్రిల్‌లో జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఉమ్మ‌డి జిల్లా ప‌రిధిలో మెద‌క్‌, జ‌హీరాబాద్ పార్ల‌మెంట్ స్థానాలు ఉన్నాయి. మెద‌క్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉమ్మ‌డి జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లు ఉండ‌గా జ‌హీరాబాద్ స్థానంలో ఉమ్మ‌డి జిల్లాలోని మూడు సెగ్మెంట్లు ఉండ‌గా కామారెడ్డి జిల్లాలో నాలుగు సెగ్మెంట్లు ఉన్నాయి. జ‌హీరాబాద్ స్థానానికి జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌గా బీఆర్ఎస్ పార్టీ నుంచి గాలి అనిల్‌కుమార్ పేరు ఖ‌రారైన‌ట్లుగా ప్ర‌చారం సాగుతుంది. ఈ స్థానం నుండి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ ఇటీవ‌లే బీజేపీలో చేరి ఆ పార్టీ నుండి టికెట్టు పొందారు. దీంతో బీఆర్ఎస్‌కు మింగుడు ప‌డ‌లేదు. అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో న‌ర్సాపూర్ అసెంబ్లీ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ నుండి నామినేష‌న్ వేసిన గాలి అనిల్‌కుమార్ అధిష్టానం ఒత్తిడితో విత్‌డ్రా చేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయ‌న బీఆర్ఎస్‌లో చేర‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌న‌కు మెద‌క్ ఎంపీ సీటు ఇస్తార‌న్న హామీతో బీఆర్ఎస్‌లో చేరిన‌ట్లు ప్ర‌చారం సాగింది. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవ‌డం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డంతో గంద‌ర‌గోళానికి దారి తీసింది. ఎలాగైనా బీఆర్ఎస్ త‌ర‌పున మెద‌క్ ఎంపీ అభ్య‌ర్థిగా నిల‌బ‌డాల‌ని గాలి అనిల్‌కుమార్ విశ్వ‌ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల దృష్ట్యా ఆ సీటును గ‌జ్వేల్‌కు చెందిన  వంటేరు ప్ర‌తాప్‌రెడ్డికి కేటాయించారు. దీంతో జ‌హీరాబాద్ స్థానం నుండి పోటీ చేయాల‌ని అధిష్టానం సూచించ‌డంతో గాలి అనిల్‌కుమార్ ఒప్పుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇలావుండ‌గా కాంగ్రెస్ పార్టీ నుండి మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నారాయ‌ణ‌ఖేడ్ నుండి టికెట్టు కేటాయించ‌గా ప్ర‌స్తుత ఎమ్మెల్యే సంజీవ‌రెడ్డి కోసం త్యాగం చేయ‌డంతో అధిష్టానం ఆయ‌న‌కే జ‌హీరాబాద్ ఎంపీ అభ్య‌ర్థిగా టికెట్టును కేటాయించింది. రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో జ‌హీరాబాద్ స్థానంలో ట్రయాంగిల్ పోరు సాగ‌నుంది. 

కాంగ్రెస్ అభ్య‌ర్థికే అనుకూలం...

జ‌హీరాబాద్ ఎంపీ స్థానంలో ట్రయాంగిల్ పోరు ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌హీరాబాద్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో సంగారెడ్డి జిల్లాలోని జ‌హీరాబాద్‌, ఆందోల్‌, నారాయ‌ణ‌ఖేడ్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ‌, జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిని ప‌రిశీలిస్తే ఆందోల్‌, నారాయ‌ణ‌ఖేడ్‌, జుక్క‌ల్‌, ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌, జ‌హీరాబాద్‌, బాన్సువాడ స్థానాల్లో బీఆర్ఎస్‌, కామారెడ్డిలో మాత్రం బీజేపీ అభ్య‌ర్థి గెలుపొందారు. అంతేగాకుండా జ‌హీరాబాద్ లోక్‌స‌భ ప‌రిధిలో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీల వారీగా ప‌రిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి 5,49,143 ఓట్లు, బీఆర్ఎస్‌కు 5,30,499 ఓట్లు, బీజేపీకి 1,72,766 ఓట్లు పోల‌య్యాయి. 2019 ఎన్నిక‌ల్లో జ‌హీరాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పాటిల్ కేవ‌లం 6వేల ఓట్ల ఆధిక్యంతో అతిక‌ష్టం మీద బ‌య‌ట‌ప‌డ్డారు. దీన్నిబ‌ట్టి ఈసారి జ‌హీరాబాద్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండ‌డం, జ‌హీరాబాద్ లోక్‌స‌భ స్థానంలో అత్య‌ధిక అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు గెలవ‌డం వ‌ల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. 

మోడీ హ‌వా ప్ర‌భావం చూపేనా ?

ప్ర‌స్తుతం భార‌త ప్ర‌ధాని మోడీ హ‌వా దేశ‌మంతా కొన‌సాగుతుంది. ఈసారి ఎలాగైనా తెలంగాణ‌లోని 17 పార్ల‌మెంట్ స్థానాల‌కు గాను 12 స్థానాల‌ను గెలుపొంద‌డం ప‌క్కా అని ఆ పార్టీ పెద్ద‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌హీరాబాద్ లోక్‌స‌భ స్థానం నుండి పోటీ చేస్తున్న బీబీ పాటిల్‌కు ప్ర‌ధాని మోడీ హ‌వా అనుకూలిస్తుందని ఆ పార్టీ నేత‌లు ధీమాగా ఉన్నారు. అంతేగాకుండా ఇటీవ‌ల సంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించిన ప్ర‌ధాని మోడీ సుమారు 9వేల కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. దీంతో బీజేపీలో జోష్ పెరిగింద‌నడంలో సందేహం లేదు. ఇలావుండ‌గా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక ప‌వ‌నాలు వీచి కాంగ్రెస్‌కు ప‌ట్టం క‌ట్టిన‌ట్లే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీకి అదేస్థాయిలో ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న ఉంద‌ని బీజేపీ నేత‌లు న‌మ్ముతున్నారు. ఇత‌ర పార్టీల నుండి బీజేపీలోకి వ‌ల‌స‌లు పెరిగిపోవ‌డం చూస్తుంటే త‌మ‌దే విజ‌య‌మ‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరి సీటు ద‌క్కించుకున్న బీబీపాటిల్ త‌న‌ను మోడీ  చ‌రిశ్మానే గెలిపిస్తుంద‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం.

.