కేసీఆర్, హరీష్‌రావును ఢీకొట్టే నేతకే టికెట్టు
మైనంపల్లి వైపే కార్యకర్తల చూపు ?
బీసీ కోటాలో నీలం మధు పేరు పరిశీలన
అధిష్టానం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మెదక్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నిక ఒక సవాల్‌గా మారింది. 2004 ఎన్నికల నుండి 2019 ఎన్నికల వరకు టీఆర్ఎస్ అభ్యర్థులే ఎంపీలుగా గెలుపొందడం జరిగింది. అంతకుముందు మెదక్ పార్లమెంట్ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఎలాగైనా మెదక్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని యోచిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు స్థానాల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకొని బలంగా ఉంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు ప్రాతినిద్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుండి బీఆర్ఎస్‌కు ధీటుగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేసే దిశలో కాంగ్రెస్ అధిష్టానం సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ స్థానం నుండి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పటాన్‌చెరుకు చెందిన నీలం మధు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా మైనంపల్లి హన్మంతరావు పేరు తెరమీదికి వస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన తనయుడు మైనంపల్లి రోహిత్‌రావుకు మెదక్ సీటు కేటాయింపు విషయంలో కేసీఆర్‌తో విబేధించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ అసెంబ్లీ సీటును రోహిత్‌రావుకు, మల్కాజిగిరి సీటు తనకు కేటాయించేలా అధిష్టానాన్ని ఒప్పించారు. మెదక్‌లో తనయుడి గెలుపుకు బాటలు వేసిన హన్మంతరావు మల్కాజిగిరిలో ఓటమి చెందారు. బీఆర్ఎస్‌ను వీడినప్పటి నుండి పార్టీ అధినేత కేసీఆర్‌పై, మాజీ మంత్రి హరీష్‌రావును దుమ్మెత్తిపోశారు. ఒకదశలో హరీష్‌రావుకు, హన్మంతరావుకు మాటల యుద్దమే కాకుండా రాజకీయ బలప్రదర్శనకు సైతం దారి తీసింది. దీంతో హన్మంతరావుపై సిద్దిపేట, మెదక్ జిల్లాలోని కాంగ్రెస్ నాయకులకు బలమైన నేత లభించినట్లయింది. ఇటీవల హరీష్‌రావుపై సవాల్ విసిరి సుమారు రెండు వేల వాహనాలతో సిద్దిపేటలో కాంగ్రెస్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఒక దశలో తాను రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు.
గులాబీ కంచుకోటను బద్దలు కొడతారా ?
మెదక్ పార్లమెంట్ స్థానం గులాబీ పార్టీకి కంచుకోటగా ఉంది. గత పదేళ్లుగా మాజీ మంత్రి హరీష్‌రావు ఉమ్మడి జిల్లాపై తనదైన ముద్ర వేశారు. అందులో భాగంగానే మెదక్ లోక్‌సభ స్థానంలో ఆరు స్థానాలు గెలుపొందేలా చేశారు. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ సీటు గులాబీ కోటలో చేరడం ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే ఎలాగైనా మెదక్ సీటును కైవసం చేసుకొని బీఆర్ఎస్‌కు బీటలు పడేలా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే అభ్యర్థి ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. కేసీఆర్, హరీష్‌రావులను తట్టుకొని నిలబడగలిగే అభ్యర్థికే టికెట్టు కేటాయించాలనే ఆలోచన ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం టికెట్టు ఆశిస్తున్నవారిలో మైనంపల్లి హన్మంతరావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు. సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్ గెలుపొందితే రాష్ట్ర రాజకీయాల్లో మరింత మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. కాగా మైనంపల్లి, నీలం మధు పేర్లను అధిష్టానంకు పంపించినట్లు ఆ పార్టీ వర్గీయులు చెబుతున్నారు.
మైనంపల్లి వైపే కార్యకర్తల చూపు....
మెదక్ ఎంపీ అభ్యర్థిగా అంగ, అర్థ బలంతో పాటు నియోజకవర్గంలోని అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కలిగిన మైనంపల్లి హన్మంతరావుకు టికెట్టు కేటాయిస్తే గెలుపు ఖాయమని కార్యకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థులే బరిలో ఉండే అవకాశాలు ఉన్నందున కాంగ్రెస్ నుంచి అదే వర్గానికి చెందిన మైనంపల్లి పోటీ చేస్తేనే ఫలితాలు బలంగా ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ కేటాయిస్తే సామాజిక న్యాయం చేయడంతో పాటు ఆ వర్గానికి చెందిన ఓట్లు రాబట్టుకోవచ్చనే ఆలోచనలో సైతం అధిష్టానం ఉంది. అయితే బీసీ మంత్రం బీఆర్ఎస్ కంచుకోటలో పనిచేస్తుందా లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు. ఏదిఏమైనా మెదక్ ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయంలో ఢిల్లీ అధిష్టానందే తుది నిర్ణయమనేది స్పష్టమవుతోంది.
