సొచ్ స్వచ్చంద సంస్థకు రూ.7.77 లక్షల భారీ విరాళం
మానవ జీవన వృక్షానికి బాల్యమే మూలాధారం
ప్రముఖ సైకాలజిస్ట్ సోనాల్ రవి అండ్రూస్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మానవ జీవన వృక్షానికి బాల్యమే మూలాధారమని, విద్యార్థులకు చిన్నతనం నుంచే నైతిక విలువలు, క్రమశిక్షణ, శ్రద్ధ వంటి లక్షణాలను నేర్పుతూ ఉత్తమ పిల్లలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని ప్రముఖ సైకాలజిస్ట్ సోనాల్ రవి అండ్రూస్ సూచించారు. ఆదివారం స్థానిక వెంకట్రావు నగర్ కాలనీలోని సిద్దార్థ్ విద్యా సంస్థల్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులకు స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భగవంతుడు వారికి సమీపంగా ఉండి బాల్య దశలోని దైవత్వం గురించి చక్కగా వివరించారు. విశిష్ట అతిథి ఇట్రొడ్ సంస్థ నిర్వాహకులు మధుకర్ రెడ్డి మాట్లాడుతూ గురువులు విద్యార్థులకు నేర్పే విద్య దీపం లాంటిదని, ఆ వెలుతురులో చిన్నారులు తమ భవిష్యత్తుకు దారిని తెలుసుకొని నడవాలని సూచించారు. బిల్డింగ్ బ్లాక్ బుక్ పబ్లిషర్స్ నిర్వాహకులు సాయి కృష్ణ మాట్లాడుతూ గురువులు నేర్పే అక్షరం క్షరం కానిదని అక్షరాల విలువను గూర్చి చాలా చక్కగా వివరించారు. సిద్ధార్థ్ విద్యాసంస్థల చైర్మన్ శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతూ మన తలరాతలు మనమే రాసుకోవాలని, మన మంచి చేతలతో బ్రహ్మరాతను కూడా మార్చుకోవచ్చన్నారు. విద్యార్థుల శక్తి సామర్థ్యాలను కొనియాడారు. విద్యాసంస్థల సెక్రటరీ సంధ్యారాణి మాట్లాడుతూ జీవితమనే వినీలాకాశంలో విద్యార్థులు చక్కగా ఎగరడానికి అర్హత, యోగ్యత అనే రెండు రెక్కలు అవసరమని విద్యా విధానం గురించి తెలియజేశారు.
సొచ్ స్వచ్చంద సంస్థకు రూ.7.77 లక్షల భారీ విరాళం
గ్రాడ్యువేషన్ డే సందర్భంగా సిద్ధార్థ్ విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం కలిసి సొచ్ స్వచ్చంద సంస్థకు రూ.7,77,777లను విరాళంగా అందజేశారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, ఇంచార్జిలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
