నేటి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు
జాతరకు వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు
నిరంతరం పర్యవేక్షించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా పిలువబడే మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గాభవానీ మాత జాతరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరకు ఏడుపాయల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏటా మహా శివరాత్రి నుంచి మూడు రోజుల పాటు జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర పండుగగా నిర్వహించే జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. భక్తుల రద్ధీకి తగ్గట్టు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇలావుండగా ఈనెల 8 నుంచి 10 వరకు జరగనున్న జాతర నిర్వహణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో ఇదివరకే వరుసగా రివ్యూ మీటింగ్‌లు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో పాటు వారం రోజుల నుంచే ఎండోమెంట్, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ట్రాన్స్‌కో, హెల్త్, ఫిషరీస్, పోలీసు వాఖలు ఏర్పట్లలో నిమగ్నమయ్యాయి.
క్యూ లైన్లు...చలువ పందిళ్లు..
జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వీఐపీ, ప్రత్యేక దర్శనం, సర్వదర్శనం కోసం వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. రాజగోపురం నుంచి ఆలయానికి వెళ్ళే దారిలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్నానాలు చేసేందుకు 13 పవర్ బాత్ లు ఏర్పాటు చేశారు. తాగునీటి కోసం జాతర ప్రాంగణంలో పలుచోట్ల 350 నల్లాలు ఏర్పాటు చేశారు. ఆలయానికి దూరంగా బసచేసే భక్తులకు తాగునీటి సప్లయ్ చేసేందుకు 20 ట్యాకర్లు ఏర్పాటు చేశారు. 50 పర్మినెంట్ మరుగుదొడ్లకు రిపేర్ చేసి నీటి వసతి కల్పించడంతో పాటు 328 టెంపరరీ మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు.
130 మంది గజ ఈతగాళ్లు..
భక్తులు మంజీరా నదిపాయల లోతు తెలియక స్నానాలు చేసేటప్పుడు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. వారిని కాపాడేందుకు ఫిషరీస్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో వనదుర్గా ప్రాజెక్టు, చెక్ డ్యాం, నదీ పాయల వద్ద 130 మంది గజ ఈతగాళ్ళను సిద్ధంగా ఉంచారు. జాతర ప్రాంగణం శుభ్రంగా ఉండేలా చూసేందుకు పంచాయతీ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో 835 మంది సిబ్బందిని నియమించారు. జాతర ప్రాంగణాన్ని ఐదు సెక్టార్లు, 40 సబ్ సెక్టార్లుగా విభజించి సిబ్బందికి డ్యూటీలు కేటాయించారు. ఎప్పటికప్పుడు చెత్త తొలగించేందుకు గాను 640 మంది పారిశుద్ధ్య సిబ్బందిని, పర్యవేక్షణకు 160 మంది సూపర్‌వైజర్లను నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడుపాయలకు ఆర్టీసీ 157 స్ఫెషల్ బస్సులను నడుపుతోంది. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్, బాలానగర్, నర్సాపూర్, సంగారెడ్డి, నారాయణఖేడ్, జోగిపేట, జహీరాబాద్, సిద్దిపేట, చేగుంట నుంచి ఏడుపాయలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
మెడికల్ క్యాంపు ఏర్పాటు....
జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సేవలు అందించేందుకు హెల్త్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో ఒక మెడికల్ క్యాంప్, 10 ఫస్ట్ ఎయిడ్ క్యాంపులు ఏర్పాటు చేసింది. 4 అంబులెన్సులు, రెండు 104 వెహికల్స్ అందుబాటులో ఉంచనున్నారు. డాక్టర్లు, పారామెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు కలిపి మొత్తం 257 మంది మెడికల్ స్టాఫ్ జాతరలో అందుబాటులో ఉంటారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు, ట్రాఫిక్ నియంత్రణకు జిల్లా ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
