ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఇసుక మాఫియా దాడి

ఫిర్యాది వివరాలు మాఫియాకు అందించిన ఎస్సై

సీఐకి ఫిర్యాదు చేసిన బాధితుడు

తెలంగాణ ప్రభ (మెదక్ ): అన్యాయాన్ని అరికట్టాల్సిన పోలీసులే మాఫియాతో కుమ్మక్కై ఫిర్యాదు చేసిన వ్యక్తిపై దాడి చేయించిన సంఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది..ఇసుక దందా అక్రమంగా సాగుతుందని 100కు సమాచారం ఇస్తే  ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళి ఇసుక మాఫియా గ్యాంగ్ దాడి చేశారు. ఈ సంఘటన చిన్నశంకరంపేట మండలం జంగరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ఎర్రోళ్ల హరీష్ రామాయంపేట సీఐకి ఎస్ఐ పై గురువారం ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నశంకరంపేట మండలంలోని జంగరాయి గ్రామ శివారులో వాగు నుంచి రాత్రి సమయంలో ప్రతిరోజు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అనుమతి లేకుండా సాగుతున్న ఇసుక అక్రమ దందాపై జంగరాయి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల హరీష్ పోలీసుల దృష్టికి తెచ్చేందుకు 100కు ఫోన్ చేసి ఇసుకను అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. 100 డయల్ చేసిన వెంటనే ఇసుక దందాను పట్టుకోవాల్సిన చిన్నశంకరంపేట ఎస్సై ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని, పైగా 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసిన ఎర్రోళ్ల హరీష్ పేరు ఇసుక మాఫియాకు తెలిపాడని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు పోలీసులు ఇసుక మాఫియాకు చెప్పడంతో వారంతా ఎర్రోళ్ల హరీష్, అతని తండ్రి పైన రాళ్లతో, కట్టెలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు సీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తూ ఫిర్యాదు చేసిన వారి సమాచారం ఇచ్చిన ఎస్ఐతో పాటు ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.

.