ఘనంగా 111వ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళల విద్యతోనే అన్ని విధాల అభివృద్ధి

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి

లింగ వివక్షత పూర్తిస్థాయిలో రూపుమాపాలి 

సంగారెడ్డి అదనపు కలెక్టర్  చంద్రశేఖర్ 

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): లింగ వివక్షను రూపుమాపినప్పుడే మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని, విద్యతోనే మహిళలు అభివృద్ధి చెందుతారని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహిళలందరికీ  అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లింగ వివక్షత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు పూనుకోవాలన్నారు. ఇంటి నుండే మార్పు ప్రారంభం కావాలని, మగపిల్లలు, ఆడపిల్లలని వేరువేరుగా చూడకుండా ఇద్దరిని సమానంగా చూడాలన్నారు. ముఖ్యంగా పిల్లల్లో మార్పు తీసుకు రావాలన్నారు. సమాజంలో పూర్తిస్థాయిలో లింగ వివక్షత రూపు మాపాలని, అప్పుడే నవ సమాజానికి నాంది పలుకుతుందన్నారు. మహిళలు తలచుకుంటే ఏదైనా అవలీలగా చేయగలరని, అన్ని రంగాలలో  రాణిస్తూ ముందుకు దూసుకు వెళ్తున్నారన్నారని అభినందించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న   అంగన్వాడీలు, ఇతర మహిళలు ఉద్యోగినిలు లింగ వివక్షత లేకుండా ఆడపిల్లను, మగ పిల్లాడిని సమానంగా చూడాలని, ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పించాలని అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళలపై అరాచకాలు జరగకుండా ఎలా నిరోధించవచ్చు, మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

మహిళలు విద్య,  వైద్యం, వ్యాపార, రాజకీయంగా, ఇతర అన్ని రంగాలలో అన్నింటా ముందుండి ఉన్నతంగా రాణించాలన్నారు. అమ్మాయిలు తాము ఎంచుకున్న రంగంలో రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అనంతరం ఉత్తమ  ప్రతిభ కనబరుస్తున్న మహిళా అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని  సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మజ రాణి, మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, డియంఎచ్ఓ గాయత్రీ దేవి,  మెప్మ పీడి గీత, పట్టణ టౌన్ ఇన్స్పెక్టర్ భాస్కర్,  సిడిపివోలు, అంగన్వాడీ మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

.