ఆడపిల్లల చదువుతో న్యాయం, ధర్మం నిలుస్తుంది

విద్యా రంగానికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత

రూ.138.10 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం  

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ

తెలంగాణ ప్ర‌భ ( ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో ): ఆడపిల్లల చదువుతో న్యాయం, ధర్మం నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపల్ పరిధిలో దాదాపు రూ.138 కోట్ల  విలువైన పలు అభివృద్ధి పనులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి గురువారం శంకుస్థాపనాలు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆడపిల్లలు చదువుకుంటే న్యాయం, ధర్మం నిలుస్తుందని, ఆడపిల్లల చదువుకుంటే  కుటుంబ పరిస్థితులు మెరుగు పడడంతో పాటు సమాజంలో కూడా మార్పు వస్తుందని అన్నారు. ఉన్నత చదువులు చదివి ఆడపిల్లలు ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం కృషి చేయనున్నట్లు తెలిపారు. మా ప్రభుత్వం విద్యారంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉమ్మ‌డి మెదక్ జిల్లా చరిత్రలోనే జోగిపేటకు గుర్తింపు ఉందన్నారు. జిల్లాలోని మొట్టమొదటి డిగ్రీ కళాశాల జోగిపేటలో ఏర్పాటయిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా జోగిపేట డిగ్రీ కళాశాలలో నిలిచిపోయిన తెలుగు  మీడియం బీకాం జనరల్ కోర్సును తిరిగి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.2.30 కోట్లతో, రూ.6 కోట్లతో మున్సిపల్ నూతన భవనం నిర్మాణం, రూ.4.15 కోట్లతో డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సంగుపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులతో పాటు రూ.20 కోట్ల నిధులతో సంగుపేట నుంచి అన్నసాగర్ వరకు నాలుగు లైన్ల నేషనల్ హైవే రోడ్డు బటర్ ఫ్లై లెట్స్, రూ.2 కోట్ల నిధులతో జోగిపేట స్టేడియం అభివృద్ధి, ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో రూ.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు, పలు అభివృద్ధి పనులకు మంత్రి  దామోద‌ర రాజ‌న‌ర్సింహ శంకుస్థాపన చేశారు.

సంగుపేట నుండి అన్నసాగర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 20 లక్షలు, పాలిటెక్నిక్ క‌ళాశాల అభివృద్ధికి రూ. 98 లక్షలు,  కేజీబీవీ ప్రహరీ గోడ ప్రారంభోత్సవం, కేజీబీవీ బ్యాలెన్స్ వర్క్స్, 124, లక్షలు( సిసి రోడ్లు లైట్లు త్రాగునీరు ) నెహ్రూ స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి, డిగ్రీ కాలేజ్ తెలుగు మీడియం సెక్షన్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేయిస్తామన్నారు. రూ.80 కోట్ల నిధులతో జోగిపేట నుండి అజ్జమర్రి వరకు మంజీరా నదిపై వంతెనతో రోడ్డు నిర్మాణ పనులకు, జోగిపేట పట్టణంలోని లబ్ధిదారులకు గృహ జ్యోతి జీరో బిల్ పత్రాలను మంత్రి  అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఆర్ అండ్‌ బి  ఈఈ  రాంబాబు , ఈపిహెచ్  వీర ప్రతాప్ , డిసిహెచ్ఓ సంగారెడ్డి, ఆర్డీవో పాండు, టీఎస్ ఈడ‌బ్ల్యూఐడిసి  డిప్యూటీ ఈఈ  రాంకుమార్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి, తహసీల్దార్ ఆంథోనీ, కేజీబీవీ ప్రిన్సిపల్స్ జ్యోతి, మాజీ  ఎంపీ సురేష్ షెట్కార్, సంబంధిత అధికారులు , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

.