బీఆర్ఎస్ హయాంలో ఏడుపాయలకు తీరని లోటు
జాతరను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహించాలి
పక్కా షెడ్ ల నిర్మాణంతో భక్తులకు శాశ్వత సౌకర్యం
మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గాభవాని దేవస్థానంకు గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తీరని లోటు జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీ నిధులతో ఏడుపాయల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం సూచించినట్లు మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ తెలిపారు. మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రభుత్వానికి మునుపెన్నడు లేని విధంగా నిధులు సమకూర్చాలని కోరగా తక్షణమే స్పందించి ఏడుపాయల జాతరకు భారీ నిధులు విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినట్లు తెలిపారు. ఇందుకు గాను రెండు కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుపాయల జతర భక్తి పారవశంతో జరగాలని, భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు. అంతేగాకుండా ఏడుపాయల్లో పక్కా షెడ్ల నిర్మాణంతో భక్తులకు శాశ్వత సౌకర్యం ఏర్పడుతుందని తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ, వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మకు ఎమ్మెల్యే రోహిత్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
.