మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): శాఖల వారీగా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకొని తద్వారా అభివృద్ధి కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో అమలు పరిచిన పక్షంలో సత్ఫలితాలు సాధ్యపడతాయని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బుధవారం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాహుల్ రాజ్ అధికారులతో శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శాఖ పైన నాకు సమగ్ర అవగాహన కలిగి ఉన్నదని తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందాలని ఇందుకు గాను టీం వర్క్ గా పని చేయాలని, డిఆర్డీఓ. జడ్పీ సీఈవో, డిపిఓ, డీఈవో, డిఎంహెచ్ఓ, జిల్లా సంక్షేమ శాఖ, ఈ శాఖలతోపాటు ప్రాధాన్యత ఉన్న శాఖలు అందరూ సమగ్ర కార్యాచరణతో ఈ నెల 15 వరకు అందజేయాలని అధికారులను ఆదేశించారు.
టీం వర్క్ బిల్డప్ చేసుకుని పాలన అందించాలని చెప్పారు. అవినీతిరహిత పాలనే లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ముందు ముందు ప్రతి డిపార్ట్మెంట్ వారీగా రివ్యూ నిర్వహించడం జరుగుతుందని ఆ రివ్యూలో అధికారులతో పాటు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అభివృద్ధిలో అలసత్వం వహించిన ఎటువంటి అధికారులనైనా ఉపేక్షించేది లేదని అన్నారు.
జిల్లా పంచాయతీ శాఖ ద్వారా గ్రామాలలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని దీనితో పాటు విద్యా, వైద్యం ప్రాధాన్యత నివ్వాలని, వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు సలహాలు సూచనలు అందించాలని సూచించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాలని అందించిన రుణాలతో ఆర్థిక అభివృద్ధి సాధించే పథకాలకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు.
ఒక వారంలో అధికారులతో మళ్ళీ మీటింగ్ నిర్వహిస్తానని చెప్పారు. అన్ని రంగాలలో మెదక్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం ఎంపీడీవోలతో మాట్లాడుతూ ప్రజాపాలన లో వచ్చిన దరఖాస్తుల పై దృష్టి సారించాలన్నారు. మండలాల్లో ఒక గ్రామ పంచాయతీని తీసుకొని అక్టోబర్ రెండవ తేదీ వరకు ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. మండలాల అభివృద్ధికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు.
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, అధికారులు ప్రజలతో సమక్యమై ప్రజల అవసరాలను గుర్తించాలన్నారు. మెదక్ జిల్లాకు ఈ వేసవి కాలానికి సంబంధించి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలన్నారు.
భూ సమస్యలకు పరిష్కారానికి ప్రభుత్వ ఇచ్చిన ఆదేశాలను వివరిస్తూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ధరణి సమస్యలపై స్పెషల్ డ్రైవ్ ద్వారా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఏ పి.డి. శ్రీనివాసరావు, డిసిహెచ్ఓ పి.చంద్రశేఖర్, ఏడి మైన్స్ జయరాజ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఇతర శాఖల అధికారులు, తహసిల్దార్లు, ఎం.పి.డి.ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
.