తూప్రాన్ బల్దియాలో నెగ్గిన అవిశ్వాసం

తాత్కాలిక  చైర్మన్ గా నందాల శ్రీనివాస్ భాద్యతలు

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఇప్పటి వరకు వైస్ చైర్మన్ గా కొనసాగిన నందాల శ్రీనివాస్ కు తాత్కాలిక చైర్మన్ గా భాద్యతలు అప్పగించిన స్పెషల్ ఎన్నికల అధికారి,  ఆర్డీవో జయచంద్రారెడ్డి.

నూతన చైర్మన్ ఎన్నికకు పది రోజుల గడువు ఇస్తూ ఎన్నికల కమిషన్ కు ఆర్డీవో సిఫార్సు చేశారు. కాగా బుధవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ అవిశ్వాస తీర్మానంపై చేతులెత్తి ఓటింగ్ నిర్వహించగా ఎక్స్ అఫిషియో సభ్యునిగా పిఅర్టీయు ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ఓటింగ్ తో మెజార్టీ సభ్యులు 11 కు చేరి అవిశ్వాసం నెగ్గింది. 

ఈ అవిశ్వాస సమావేశంలో కౌన్సిలర్ లు మామిండ్ల జ్యోతీ కృష్ణ, రామునిగారి శ్రీశైలంగౌడ్, కుమ్మరి చెలిమేల ప్రియాంక, జిన్నా భగవాన్ రెడ్డి , పల్లెర్ల జ్యోతీ రవీందర్ గుప్త, చింతల రవీందర్ రెడ్డి, భానాపురం రాజు, నందాల శ్రీనివాస్, కొడిప్యాక నారాయణ గుప్త, జమాలపూర్ లక్ష్మీబాయి నర్సోజి లు కలిసి 11మంది  అవిశ్వాస ఓటింగ్ లో పాల్గొని చేతులు ఎత్తి ఓటేశారు. దీంతో  అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీవో జయ చంద్రా రెడ్డి ప్రకటించారు. తాత్కాలిక చైర్మన్ గా నందాల శ్రీనివాస్ ను ప్రకటించారు. 

మరో పది రోజుల్లో నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ కు, ఉన్నతాధికారులకు  సమాచారం అందించారు.

ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ కమిషనర్  ఖాజా మొనొద్దిన్ పాల్గొన్నారు.

.