కాంగ్రెస్-బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్క‌టే

తెలంగాణ‌లో 17 ఎంపీ సీట్లు గెలుస్తాం

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి

తెలంగాణ ప్ర‌భ ( ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో ): తెలంగాణ‌లో కాంగ్రెస్‌-బీఆర్ఎస్ పార్టీలు దొందుదొందేన‌ని...ఆ పార్టీల డీఎన్ఏ ఒక్క‌టేన‌ని కేంద్ర‌మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. మంగ‌ళ‌వారం సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరు ప‌టేల్‌గూడ‌లో ఏర్పాటు చేసిన బీజేపీ విజ‌య సంక‌ల్ప స‌భ‌లో మాట్లాడారు. గ‌త ప‌దేళ్ళ పాల‌న‌లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం తెలంగాణ‌లో దోపిడీకి గురి చేసింద‌న్నారు. ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చినా ఆ పార్టీ ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌న్నారు. రెండు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీల‌ని, ఎంఐఎం పార్టీకి కొమ్ముకాసే పార్టీల‌ను విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల కోసం, దేశం  కోసం ప‌నిచేసే పార్టీ బీజేపీ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ త‌న కొడుకును సీఎం చేయ‌డానికి పాటుప‌డితే...కాంగ్రెస్ రాహుల్‌గాంధీని ప్ర‌ధానిని చేయ‌డానికి కృషి చేస్తున్నారు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు చేసిందేమీ లేద‌న్నారు. కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాహుల్‌గాంధీ టాక్స్ పేర దోపిడీకి పాల్ప‌డుతుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుండి ల‌క్ష‌లాది కోట్ల రూపాయ‌ల నిధుల‌తో అభివృద్ధి చేస్తుంద‌న్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చార‌ని చెప్పారు. అందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా వేదిక‌గా రూ.9వేల కోట్ల అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. దేశ ప్ర‌జ‌లంతా త‌న కుటుంబంగా భావించి ప్ర‌ధాని మోదీ భావిస్తే ప్ర‌తిప‌క్షాలు కుటుంబ పాల‌న కొన‌సాగించాల‌ని చూస్తున్న‌ట్లు విమ‌ర్శించారు. మోదీ గ్యారంటీలు ప్ర‌జ‌ల‌కు శ్రీ‌రామ ర‌క్ష‌ని తెలిపారు. ప్ర‌పంచం మొత్తం మోదీ వైపు చూస్తుంద‌ని, రాబోయే  రోజుల్లో భార‌త్ ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించేలా మోదీ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు. రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని 17 ఎంపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకొని మోదీకి గిఫ్ట్ గా ఇవ్వ‌నున్న‌ట్లు కిష‌న్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీకి మెమోంటోను కిష‌న్‌రెడ్డి అంద‌జేశారు.

.