కుటుంబవాదం ప్రజాస్వామ్యానికి విఘాతం

ఆ పార్టీల‌కు చ‌ర‌మ‌గీతం పాడాలి

భార‌త్‌ను మూడ‌వ ఆర్థిక దేశంగా మారుస్తా

మోదీ గ్యారంటీ అంటే అమ‌లు కావాల్సిందే

బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం

కాళేశ్వ‌రం ప్రాజెక్టులో బీఆర్ఎస్ వేల కోట్లు దోచుకుంది

తెలంగాణ‌ను కొత్త ఏటీఎంగా మార్చిన కాంగ్రెస్‌

రూ.9 వేల కోట్ల అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన పీఎం మోదీ

సంగారెడ్డి జిల్లాలో పీఎం టూర్ విజ‌య‌వంతం

తెలంగాణ ప్ర‌భ ( ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో ): దేశంలో కుటుంబ పాల‌నతో ప్ర‌జాస్వామ్యానికి విఘాతం క‌లుగుతుంద‌ని...కుటుంబవాదుల‌కు ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడాల‌ని భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లాలో మంగ‌ళ‌వారం పీఎం మోదీ ప‌ర్య‌టించి రూ.9వేల కోట్లతో చేప‌ట్టిన ప‌లు అభివృద్ధి ప‌న‌ల‌ను ప్రారంభించారు. అనంత‌రం జిల్లాలోని ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గం ప‌టేల్‌గూడ‌లో ఏర్పాటు చేసిన బీజేపీ విజ‌య‌సంక‌ల్ప స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగం ఆద్యంతం ప్ర‌తిప‌క్షాల‌పై దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌సంగం మ‌ధ్య‌లో తెలుగులో మాట్లాడ‌డం స‌భికుల‌ను ఆక‌ట్టుకుంది. ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ.. దేశంలో కుటుంబ పార్టీలకు చరమగీతం పలకాల‌ని, దేశం కోసం పనిచేసే పార్టీ బీజేపీ మాత్ర‌మేన‌ని తెలిపారు. తొమ్మిదిన్న‌ర బీజేపీ పాల‌న‌లో దేశం ఎంతో ప్ర‌గ‌తిని సాధించింద‌ని, రాబోయే రోజుల్లో ప్ర‌పంచానికి భార‌త్ మార్గ‌ద‌ర్శ‌కంగా మార‌బోతుంద‌న్నారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో దేశంలో త‌మ ప్ర‌భుత్వంపై సుస్థిర‌మైన న‌మ్మ‌కం ఏర్ప‌డింద‌న్నారు. న్యాయ‌బ‌ద్దంగా, ప్ర‌జాస్వామ్యంగా అయోధ్యలో రాముని మందిరం నిర్మించుకొని 140 కోట్ల మంది భార‌తీయులు రామ్‌ల‌ల్లాకు స్వాగ‌తం ప‌లికామ‌న్నారు. ప్ర‌తి ప‌క్షాలు కుటుంబ‌వాదాన్ని బ‌ల‌ప‌రుస్తూ నాకు కుటుంబం లేదంటున్నార‌ని, దేశంలోని ప్ర‌జ‌లంతా నా కుటుంబ‌మేన‌ని వివ‌రించారు. విప‌క్ష నేత‌ల అవినీతిని బ‌య‌ట‌పెడితే వారి క‌ళ్లు మండుతున్నాయ‌ని చెప్పారు. కుటుంబ‌వాదులంతా త‌మ కుటుంబానికి మేలు చేసుకున్నారు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు కాద‌న్నారు. వారంతా విదేశీ బ్యాంకుల్లో న‌ల్లధ‌నాన్ని దాచుకోవ‌డానికి ఖాతాలు తెరిస్తే...దేశంలో నిరుపేద మ‌హిళ‌ల‌కు అండ‌గా ఉండ‌డానికి మోదీ జ‌న్‌ధ‌న్ ఖాతాల‌ను తెరిచాన‌ని ప్ర‌ధాని వివ‌రించారు. కుటుంబ‌వాదులు త‌మ పిల్ల‌ల‌కు భ‌వంతులు క‌ట్టిస్తే...దేశంలో నిరుపేద‌ల‌కు 4 కోట్ల ఇండ్లు క‌ట్టించిన ఘ‌న‌త మాదేన‌న్నారు. కుటుంబ‌వాదుల‌కు దోచుకోవ‌డానికి ఏమైనా లైసెన్సు ఇచ్చారా అంటూ నిల‌దీశారు. 

మోదీ గ్యారంటీ అంటే ప‌క్కా గ్యారంటీ...:

దేశ అభ్యున్న‌తి కోసం మోదీ గ్యారంటీ ఇచ్చారంటే అది ప‌క్కాగా అమ‌లు అయిన‌ట్లేన‌ని ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల సాక్షిగా ఈ స‌భ‌లో మీకు మ‌రో గ్యారంటీ ఇస్తున్నాన‌ని...రాబోయే రోజుల్లో ప్ర‌పంచంలోనే భార‌త‌దేశం మూడ‌వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మార్చ‌బోతున్న‌ట్లు చెప్పారు. ఇందుకు తెలంగాణ ప్ర‌జ‌లు పూర్తి మ‌ద్ద‌తునివ్వాల‌ని కోరారు. ఫిర్ ఏక్ బార్ మోదీ స‌ర్కార్ అంటూ తెలంగాణ ప్ర‌జ‌లు ఆశీర్వ‌దించాల‌ని కోరారు. మోడీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ హ్యాట్రిక్ సాధించబోతుంద‌ని ప్ర‌జ‌లంతా న‌మ్ముతున్న‌ట్లు చెప్పారు. విదేశాల్లో తెలుగువారిని చూస్తే ముచ్చ‌టేస్తుంద‌న్నారు. వారు సాధించిన విజ‌యాలు ఎంతో గొప్ప‌వ‌న్నారు. కాంగ్రెస్ పార్టీ దాని దాని మిత్రపక్ష పార్టీల అవినీతి బ‌య‌ట పెడుతున్నాన‌ని త‌న‌పైన విమ‌ర్శ‌లు చేయ‌డానికే ప‌రిమిత‌మ‌య్యార‌ని తెలిపారు. జమ్ము కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు ఎక్కడెక్కడైతే కుటుంబ పాలన కొనసాగిస్తున్న పార్టీలు ఉన్నాయో అక్కడ వారి కుటుంబాలు ఆర్థికంగా బలపడుతున్నాయి త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఏం ఒరిగింది లేద‌న్నారు. దేశానికి యువ నాయకత్వం ఎంతో అవసరమ‌న్నారు. దేశంలోని ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా కుటుంబమే.. ఇది ఇండియా కూటమికి అర్థం కావడం లేదన్నారు. తెలంగాణ వికాసం కోసం వేలకోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల మౌలిక వసతుల  కల్పనకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశామ‌న్నారు. యువ‌త‌ కలలను సాకారం చేయడమే మోడీ సంకల్పమ‌న్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అణ‌గారిన వర్గాల ప్రజలందరూ బీజేపీ వెనుకే ఉన్నారన్నారు. పీఎం కిసాన్ సన్మాన్ నిధి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులకు అండగా నిలిచామ‌న్నారు. తెలంగాణ సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామ‌ని తెలిపారు. 

బీఆర్ఎస్‌-కాంగ్రెస్ ఒకే గూటి ప‌క్షులు...:

తెలంగాణ‌లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకే గూటి ప‌క్షుల‌ని పీఎం మోదీ విమ‌ర్శించారు. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన న‌చ్చ‌క కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని...ప్ర‌స్తుతం తెలంగాణ‌ను కొత్త ఏటీఎంగా కాంగ్రెస్ మార్చింద‌న్నారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్ఓ ఒకే నాణానికి రెండు ముఖాల్లాంటి వార‌ని విమ‌ర్శించారు. ఆ రెండు పార్టీల మ‌ధ్య చీక‌టి ఒప్పందం ఉంద‌న్నారు.  కాళేశ్వ‌రం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ వేల కోట్లు దోచుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చ‌ర్య‌లు తీసుకుంద‌ని ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం భాగస్వాములయ్యారని ఆరోపించారు. ఇది ఎక్కువ రోజులు కొనసాగనివ్వమ‌ని పీఎం హెచ్చ‌రించారు. 

నరేంద్ర మోడీ నాయకత్వంలో సర్జికల్ స్ట్రైక్ చేశాం..ఎయిర్ స్ట్రైక్  కూడా చేస్తామ‌న్నారు. రాబోయే లోక్‌స‌భ  ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని, తెలంగాణ‌లో 17 సీట్ల‌లో బీజేపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని కోరారు. అనంత‌రం స‌భ‌లో మోదీ నినాదాలు మారుమ్రోగాయి..ప్ర‌ధాని మోదీ చేసిన నినాదాల‌కు స‌భికులు వంత‌పాడారు. ఫిర్ ఏక్ బార్ మోదీ స‌ర్కార్‌...భార‌త్ మాతాకీ జై...జై శ్రీ‌రాం నినాదాలు మిన్నంటాయి. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర‌మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌, మాజీ ఎమ్మెల్యేలు ర‌ఘునంద‌న్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌, నందీశ్వ‌ర్‌గౌడ్‌, జ‌హీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌, సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షురాలు గోదావ‌రి అంజిరెడ్డి, జిల్లా నాయ‌కులు పాల్గొన్నారు. 

రూ.9వేల కోట్ల అభివృద్ధి ప‌నులు ప్రారంభించిన పీఎం

సంగారెడ్డి జిల్లా ప‌టాన్‌చెరులోని ప‌టేల్‌గూడలో రూ.9,021 కోట్ల అభివృద్ధి ప‌నుల‌ను వ‌ర్చువ‌ల్‌గా ప్ర‌ధాని మోదీ ప్రారంభించారు. ఘ‌ట్‌కేస‌ర్ టు లింగంప‌ల్లి వ‌ర‌కు ఎంఎంటీఎస్‌, మెద‌క్‌-ఎల్లారెడ్డి మ‌ధ్య నాలుగు లైన్ల హైవే, సంగారెడ్డి క్రాస్ రోడ్డు నుండి మ‌దీనాగూడ వ‌ర‌కు 6 లైన్ల హైవే విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. అంతేగాకుండా బేగంపేట విమానాశ్ర‌మంలో దేశంలోనే తొలి సివిల్ ఏవియేష‌న్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిద్వారా స్టార్ట‌ప్‌లు, నైపుణ్య శిక్ష‌ణ‌కు  ఈ కేంద్రం వేదిక‌గా నిలుస్తుంది. దీంతో తెలంగాణ‌లోని యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌డ‌మే కాకుండా గుర్తింపు కూడా ల‌భిస్తుంద‌ని మోదీ తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై, రాష్ట్ర మంత్రులు కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, కొండా సురేఖ, బీజేపీ జాతీయ నాయ‌కుడు ల‌క్ష్మ‌ణ్‌, సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ వ‌ల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్‌, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

.