తెలంగాణ ప్రభ (కోరుట్ల): అది ఓ నిరుపేద కుటుంబం...చేతి రాతనే నమ్ముకున్న కుటుంబం. తల రాతను మార్చాలనుకున్న ఓ ఆర్టిస్టు అన్నీ తానై కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఐదుగురు ఆడపిల్లలు పుట్టిన అధైర్యపడకుండా సరస్వతిని నమ్ముకుని వారిని ఉన్నత చదువులు చదివించాడు.
తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ ఆ బిడ్డలు కూడా చదువుల్లో రాణించారు.
అతనే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన కొండ్లెపు రాజారాం. ఆర్టిస్టుగా పనిచేస్తున్న రాజారాం ఫ్లెక్సీ రాకతో తన ఉపాధికి ఇబ్బంది వచ్చినా తన పిల్లల చదువుకు ఇబ్బంది రానీయలేదు.
ఈ క్రమంలోనే రాజారాం పెద్ద కుమార్తె కొండ్లెపు శరణ్య జేఎన్‌టియూలో బి.టెక్, ఎంటెక్ పూర్తి చేసింది. జాతీయ స్థాయి నెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, బాసర ట్రిపుల్ ఐటి వంటి ప్రతిష్టాత్మక సంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసింది. తాజాగా గురుకుల డిగ్రీ ఉపన్యాసకురాలిగా ఎంపికైంది. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఎంపికైన శరణ్య తన కుటుంబానికి ఆశా దీపం అయింది.
ఓ తండ్రి నమ్మకాని నిలబెట్టి మరెందరికో స్ఫూర్తిగా నిలిచింది.
.