సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హేతుబద్దీకరణ ( రేషనలైజేషన్) కార్యక్రమాన్ని ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.
శుక్రవారం మినీ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ ప్రతినిధులతో హేతుబద్దీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ లొకేషన్ చేంజ్ చేసిన ఓటర్ల వివరాలు, డూప్లికేట్ ఓటర్లు వివరాలు, మరణించిన ఓటర్ ల జాబితాను తన దృష్టికి తీసుకువస్తే ప్రత్యేకంగా పరిశీలించి, విచారణ జరిపిస్తామని అన్నారు. స్వీప్ కార్యక్రమమాల ద్వారా ఓటింగ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సదుపాయం, వృద్ధులకు, వికలాంగులకు ర్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాజకీయ ప్రతినిధులు మాట్లాడుతూ పెళ్లిళ్ల సీజన్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నందున, వివాహ కార్యక్రమాలకు షాపింగ్ కొరకు ప్రజలు తమ వెంట నగదు తీసుకువెళ్తారని, చెక్ పోస్టులవద్ద తనిఖీలలో పట్టుబడిన నగదును వారికి వెంటనే అందించే ఏర్పాటు చేయాలని జిల్లాఎన్నికల అధికారిని కోరారు. అందుకు ఆమె స్పందిస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. చెక్ పోస్టులలో పట్టుబడిన నగదు కొరకు జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని, పట్టుబడిన నగదుకు సరియైన పత్రాలు చూపించి నగదును పొందవచ్చని తెలిపారు.
.