త్వరలో ప్రజా పాలన సేవా కేంద్రాలు : మెదక్ జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్

ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు

ప్రజాపాలన దరఖాస్తులు ఇవ్వవచ్చు

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్ 

తెలంగాణ ప్రభ (మెదక్): త్వరలో ప్రజా పాలన సేవ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మెదక్ జిల్లా అదనపు కలెక్టర్లు   వెంకటేశ్వర్లు, రమేష్ వెల్లడించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజా పాలన సేవ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. అన్ని పని దినాల్లో ఉదయం 10.30 నుంచి 5.00 గంటల వరకు కేంద్రాలు కొనసాగుతాయని వివరించారు. ఆయా కేంద్రాల్లో ఒక అధికారి, ఆపరేటర్ ఉండాలని వారు ఆదేశించారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు కల్పించాలని తెలిపారు. అలాగే జిల్లాలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల్లోకి పోలీసులు అనుమతించిన తరువాతే అధికారులు, సిబ్బంది లోపలికి వెళ్లాలని సూచించారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని స్పష్టం చేశారు. 

అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీ ఎస్) శాంతకుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ లతో మాట్లాడారు. ఇంటర్మీడియట్ పరీక్షలు, ప్రజాపాలన దరఖాస్తులపై వివరాలు సేకరించారు. ఈ నెలలో మొత్తం పరీక్షలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా కొందరి దరఖాస్తులలో సమాచారం, జిరాక్స్ కాపీలు లేవని, వాటిని త్వరలో ప్రారంభించనున్న ప్రజా పాలన సేవ కేంద్రాల్లో మళ్లీ ఇవ్వవచ్చని, అలాగే నూతన దరఖాస్తులు చేసుకోవచ్చని 

సీఎస్ స్పష్టం చేశారు. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో

ఏర్పాటు చేయనున్న ప్రజా పాలన సేవ కేంద్రాల్లో నూతన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని తెలిపారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ఇంటర్, పదో తరగతి పరీక్షలపై సమీక్షించారు.  ఒక నిమిషం ఆలస్యంగా విద్యార్థులు వస్తే సరైన కారణం ఉంటే అనుమతించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లోకి ప్రతీ ఒక్కరినీ తనిఖీ చేసి లోపలికి పంపాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఎవరినీ బయటికి పంపవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే సెల్ ఫోన్లు అనుమతించాలని సీఎస్ స్పష్టం చేశారు. 

వీసీ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ఎల్లయ్య, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డిఐఈఓ సత్యనారాయణ, మునిసిపల్ కమిషనర్స్ జానకిరామ్ సాగర్,  దేవేందర్ పాల్గొన్నారు.

.