తెలంగాణ ప్రభ ( సంగారెడ్డి ): సంగారెడ్డి జిల్లా గ్రంథాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకస్మిక తనిఖీ చేసారు. గ్రంథాలయంలో పాఠకులకు అందుతున్న సేవలను, కావలసిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు, గ్రంథాలయం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రంథాలయంలోని ఆచూకి విభాగం, సాధారణ విభాగం, వాగ్దేవి కళామందిరం ఆడిటోరియంలో చదువుకుంటున్న పాఠకుల దగ్గరికి వెళ్ళి పలకరించి వారు ఏయే ఉద్యోగాలకు పోటీ పడుతున్నారో తెలుసుకున్నారు. చదువుతున్న పుస్తకాలు గ్రంథాలయం వారు సమకుర్చినవేనని పాఠకులు కలెక్టర్ కు తెలిపారు. పాఠకులు అక్షయ పాత్ర భోజనం గురించి అడగడం జరిగింది. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఏర్పాటు చేయుటకు ఆదేశిస్తానని హామీ ఇచ్చారు, పోటీ పరీక్షల పుస్తకాలు అవసరం మేరకు తెప్పించాలని గ్రంథాలయ సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో సంగారెడ్డి తహసీల్దార్ దేవదాస్, జిల్లా గ్రంధాలయ సిబ్బంది పాల్గొన్నారు.
