ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 95.78 శాతం హాజరు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని  సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  తెలిపారు. బుధవారం నుండి ప్రారంభమయిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలలో భాగంగా  ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న కాలేజీలలో  సంగారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), శ్రీతేజ ప్రయివేట్ కళాశాలలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును గమనించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 18780 మందికి గాను 17988 మంది పరీక్షలకు హాజరయ్యారని, 792 మంది గైర్హాజరు అయ్యారని తెలిపారు. బుధవారం జరిగిన  ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 95.78 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని, పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించామని,  పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో  విధులు నిర్వహించే సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్, తహశీల్దార్ దేవదాస్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత ఉన్నారు.

.