ఎంఎస్ఎస్ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా విస్తృతంగా సేవలందించాలి
తెలంగాణ గవర్నర్ తమిళిసై సుందరరాజన్
రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సమస్యలకు... బాధ్యతలకు... చేయూతకు... నియోజక వర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా జవాబుదారీగా పనిచేయాలని... రాజకీయ భవిష్యత్ ఉజ్వలమైన భవిష్యత్ గా ఎదగడమే కాకుండా సమాజంలో ఉన్నతమైన స్థానంతో పాటు మంచి పేరు లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సుందరరాజన్ అన్నారు. బుధవారం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలంగాణ గవర్నర్ ను రాజ్ భవన్ కు వెళ్ళి మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాని అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ డాక్టరేట్ పట్టాను పొందడమే కాకుండా వైద్య వృత్తిని వదిలేసి ప్రజలకు సేవలందించేందుకు తీసుకున్న రాజకీయ నిర్ణయం శుభసూచకం అని అన్నారు. అంతే కాకుండా తక్కువ సమయంలోనే ప్రజల్లోకి ఎంఎస్ఎస్ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు అందించేందుకు చేసిన కృషి అంతా ఇంతా కాదని అన్నారు. మీ స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన కార్యక్రమాలే మీ నియోజక వర్గ ప్రజల మనసులను దోచుకుందని అన్నారు. యువ ఎమ్మెల్యేగా గెలుపొందడం చాలా సంతోషకరంగా ఉందని, మీ ఉజ్వలమైన భవిష్యత్ కు నావంతు సహాయ సహకారాలు అందిస్తానని గవర్నర్ తెలిపారు.
