కౌన్సిలర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే రోహిత్ రావు
రసాభసగా సాగిన మెదక్ బల్దియా సమావేశం
తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం రసాభాసగా మారింది. మంగళవారం మెదక్ మున్సిపల్ సమావేశం చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులుకు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ముందుగా వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ సంక్షేమం విషయంలో నిధులు కేటాయించాలని, అభివృద్ధి చేయాలని ప్రస్తావించగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మెదక్ పట్టణ అభివృద్ధి పూర్తిస్థాయిలో ఉంటూ పడిందని చెప్పారు. దీంతో కౌన్సిలర్ ఆంజనేయులు కలగజేసుకొని విమర్శ చేయగా ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వం సంక్షేమం చేయలేదని, కమిషన్ ల కోసం మాత్రమే అని చేసిందని అన్నారు. డబ్బుల కోసం అమ్ముడుపోయిన వ్యక్తులు అభివృద్ధి గురించి ప్రశ్నిస్తారా అంటూ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరువురి మధ్య కొద్దిసేపు తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నిధుల గురించి ఎందుకు ప్రశ్నించలేదని, అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.
మున్సిపల్ ఆదాయం కోసం ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేదని అన్నారు. రామాలయం ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేయలేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత 83 వేలు ఉన్న మున్సిపల్ ఆదాయం ఐదు లక్షల కు పెంచామని చెప్పారు. బీఆర్ఎస్ నేతల డబ్బులు తీసుకొని ఇక్కడ సిద్దిపేట చెంచాలు ఆరోపణలు చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి అవినీతి పరుల వల్ల మెదక్ వెనుకబాటుకు గురైందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చైర్మన్, కౌన్సిలర్లు కలగజేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు. అనంతరం కౌన్సిలర్ ఆంజనేయులు సభాముఖంగా ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పడంతో సమావేశం యధావిధిగా కొనసాగింది. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.
.