మాదకద్రవ్యాలను రూపుమాపడంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు అవుదాం
మెదక్ జిల్లా ఎస్పీ బి.బాలస్వామి
తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో ): ఆధునీకరణ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో గంజాయి సరఫరా, విక్రయాలు చేసే నేరస్తులు కూడా కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారని, తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న గంజాయి చాక్లెట్ల కలకలం ఇందుకు ఉదాహరణ అని మెదక్ జిల్లా ఎస్పీ డాక్టర్ బి.బాలస్వామి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆకు, సిగరెట్లు, పొడి, లిక్విడ్ రూపంలో గంజాయి రవాణా, అమ్మకాలు చేసే మాఫియా ఇప్పుడు చాక్లెట్ల రూపంలోకి కూడా మార్చి చిన్న పిల్లలను సైతం గంజాయికి బానిసలుగా మార్చుతోందని వాపోయారు. చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన కొంతమంది యువత బలహీనతను ఆసరగా తీసుకుని గంజాయి మాఫియా రెచ్చిపోతుందని, ఇంతకుముందు గంజాయి, డ్రగ్స్ ప్రస్తుతం మారుమూల ప్రదేశాలకు, చిన్నచిన్న ఊళ్ళకూ కూడా పాకడం శోచనీయమన్నారు. విద్యార్ధుల అమాయకత్వం లక్ష్యంగా స్కూళ్ళ వద్ద, పాన్ షాపుల్లో దందాను యధేచ్చగా నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్ట్యా మత్తు పదార్థాలు సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వాటిని విద్యార్ధులు, యువతకు దూరం చేయాలనే లక్ష్యంగా జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ చోరీలకు పాల్పడుతూ, ఇతరులపై దాడులు చేస్తూ ప్రమాదాలకు పాల్పడడం, ప్రేమ వ్యవహారాలు తదితర కారణాలే కాకుండా తల్లిదండ్రులను డబ్బులు అడగడం.. ఇవ్వకపోతే దాడులు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. గంజాయికి బానిసలుగా మారిన యువకుల శరీరాకృతి సైతం మారిపోయి మానసిక రోగులుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ విషయం గురించి ప్రజల్లో మెరుగైన చైతన్యం కొరకు పోలీసు కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అభివృద్ధికి అవరోధంగా మత్తు పదార్థాలు లేకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని భాద్యతగా వెంటనే మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712657888 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎస్పీ బాలస్వామి తెలిపారు.
.