దశాబ్దాల శ్రమకు దక్కిన ఫలితం

మెదక్ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి

తెలంగాణ ప్రభ (మెదక్): దేశంలోని 554 రైల్వేస్టేషన్ లను ఆధునీకరించే ఉద్దేశ్యంతో ప్రవేశ పెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  వర్చ్యువల్ గా శంకుస్థాపన గావించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మెదక్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ  మాట్లాడుతూ మెదక్ ప్రజల దశాబ్దాల కోరిక మెదక్ రైల్వే స్టేషన్ అని, మెదక్ రైల్వే సాధన సమితి నాయకులు, ఎంతోమంది నాయకులు మెదక్ రైలు తేవడానికి ఎన్నో రకాలుగా శ్రమించారని వారి కృషిని ఈ విధంగా గుర్తు చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ శేరి అన్నారు. దేశంలో రైల్వే స్టేషన్లను ఆధునికకరించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అమృత్ భారత్ పథకంలో భాగంగా మెదక్ స్టేషన్ను ఎంపిక చేసి 15 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,  కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.  మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలని సగటు మెదక్ వాసుల ఆశ అని, మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందాలంటే మెదక్ నుండి మనోహరాబాద్ వరకు రైలు మార్గం వేయడం ద్వారా దూరం తగ్గి ప్రయాణ సదుపాయం పెరుగుతుందని అన్నారు. అంతేగాక భవిష్యత్తులో మనోహరాబాద్ రైల్వే జంక్షన్ గా ఏర్పడే అవకాశం ఉన్నందున  హైదరాబాద్ నుంచి నగర సమీప ప్రాంతాలకు పుష్ పుల్ ట్రైన్లు నడిచే అవకాశం ఉన్నందున మెదక్ అభివృద్ధికి అవకాశం ఉండే విధంగా రైలు ప్రయాణాన్ని సులభతరం చేయాలని కోరారు. ఈ ప్రతిపాదిత మార్గం ద్వారా హైదరాబాద్ నుండి నిజామాబాద్-నాందేడ్ దూరం కూడా తగ్గి త్వరగా వెళ్లే అవకాశం ఉంటుందని  పేర్కొన్నారు. మెదక్ ప్రాంత అభివృద్ధికి దోహదపడే రైలు మార్గాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేయాలని తాను కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ తెలిపారు.

.