సీఎంఆర్ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు

సీఎంఆర్ కు  ఫిబ్రవరి 29 చివరి తేదీ

రైస్ మిల్లర్లకు తేల్చి చెప్పిన   జిల్లా కలెక్టర్ రాజర్షి షా

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): జిల్లాలో అధిక శాతం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)  పెండింగ్  వున్నా  మిల్లుల  యజమాన్యలతో మిల్లుల వారీగా శుక్రవారం కలెక్టరేట్ లో మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వం   నిర్ధేశించిన గడువు ఫిబ్రవరి 29  వరకు అవకాశం ఇచ్చిందని , అప్పటిలోగా బియ్యం పెట్టని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ క్రింద స్థిర, చర  ఆస్తులు జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు  తప్పవని హెచ్చరించారు.

నెలలు గడుస్తున్నా మిల్లర్లు అలసత్వాన్ని తీవ్రంగా పరిగణమిస్తామని  హెచ్చరించారు. సీఎంఆర్ కేటాయింపులపై కూలంకషంగా చర్చించారు. రైతుల నుండి ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసి సమకూర్చిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ జరుపుతూ ఈనెలాఖరు లోగా నిర్దేశిత కోటాకు అనుగుణంగా కస్టమ్ మిల్లింగ్ రైస్ నిల్వలను భారత ఆహార సంస్థకు చేరవేయాలని రైస్ మిల్లర్లకు సూచించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తూ, నిబంధనలను ఉల్లంఘించే రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని కరాఖండీగా తేల్చిచెప్పారు. సీఎంఆర్ కేటాయింపుల్లో జాప్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నందున, ఇకపై మిల్లర్ల అలసత్వాన్ని తాము ఎంత మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. జిల్లాలోని రైస్ మిల్లులలో సీ.ఎం.ఆర్ కేటాయింపుల పట్ల  నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే ధాన్యాన్ని కొనుగోలు చేసైనా నిర్ణీత గడువులోపు లక్ష్యానికి అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని మిల్లర్లకు తేల్చి చెప్పారు.

జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గల అన్ని రైస్ మిల్లులలో తప్పనిసరిగా పూర్తి స్థాయి సామర్ధ్యానికి అనుగుణంగా కస్టమ్ రైస్ మిల్లింగ్ జరుపుతూ, ఈ నెలాఖరు లోపు ఎఫ్సీఐ కి నిల్వలు చేరవేయాలని తెలిపారు. 

ఈ సమావేశంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ , డిసిఎస్ఓ  బ్రహ్మరావు , రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

.