వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు

ఐడీఎస్ఎంటీ సమస్య పరిష్కరానికి కృషి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంబంధిత జిల్లా, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ సమావేశ మందిరంలో అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిని సందర్శించి పలు వార్డులను పరిశీలించారు.

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో టైఫాయిడ్ జ్వరంతో చికిత్స తీసుకుంటున్న కోహిర్ మండలం రాజనిల్లి  గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్  విద్యార్థిని మిస్సీ అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మిస్సీ టైఫాయిడ్ జ్వరంతో చికిత్స  తీసుకుంటూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం బోటనీ, జువాలజీ  పరీక్షల కోసం సిద్ధం అవుతున్నందుకు అభినందించారు. ఆస్పత్రిలోని ప్రధాన విభాగాలను మంత్రి స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కు పలు సూచనలు చేశారు. ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ విభాగాన్ని సందర్శించారు.  నిమ్స్ ఆసుపత్రి నెఫ్రాలజీ నిపుణులైన డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. డయాలసిస్ విభాగంలో రోగులకు మరిన్ని వైద్య ఆరోగ్య సేవలు అందించడానికి ఐదు ఐసియు బెడ్ లను తక్షణం మంజూరు చేశారు. సమీక్ష సందర్భంగా ఐడీఎస్ఎంటీ సమస్య పరిష్కరానికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపర్చి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు.

పట్టణంలో పెరుగుతున్న జనాభా కనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనకు దృష్టి పెట్టాలని  మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. పట్టణంలో మురుగు నీటి వ్యవస్థ, పారిశుధ్యం, రోడ్డు మరమ్మతులు, చెత్త డంపింగ్ యార్డు సమస్యల పరిష్కారానికి సుదీర్ఘంగా చర్చించారు. పట్టణంలో వివిధ జంక్షన్ల సుందరీకరణపై చర్చించారు. సమీకృత వెజ్ ఆండ్ నాన్ వెజ్ మార్కెట్ భవన దుకాణాల తాళాలను కాంట్రాక్టర్ నుంచి కలెక్టర్ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి అందజేశారు. జహీరాబాద్ నియోజకవర్గ  పర్యటనలో భాగంగా మంత్రి దామోదర రాజనర్సింహ ఝరాసంఘం మండలం బర్దిపూర్ లో రూ.2.5 కోట్ల జాతీయ ఆరోగ్య మిషన్ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మాజీ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ ,  మాజీ మంత్రి  డాక్టర్ ఏ. చంద్రశేఖర్,  మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్డీఓ రాజు,  వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు  పాల్గొన్నారు.

.