ఎన్నికల నియమావళిని పకడ్బందీగా నిర్వహించాలి : సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలి

సెక్టార్ అధికారులు ప్రతీ  పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలి

సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ): రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  వల్లూరు క్రాంతి అన్నారు.

గురువారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై మొదటి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్, జహీరాబాద్  పార్లమెంట్ ఎన్నికలకు  సంబంధించిన సెక్టార్ అధికారులు, పిఓలకు, ఏపిఓ ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టికల్ సర్వేలేన్స్, వీడియో సర్వెలెన్స్, వీడియో వ్యూయింగ్ బృందాలు, తహశీల్దార్లు, ఎంపిడిఓలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై  నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి  అమలుకు అధికారులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల  నిర్వహణలో భాగంగా ఎన్నికల మార్గదర్శకాలు, నియమావళిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, వివిధ బృందాలకు  కేటాయించిన విధులు, నియమ నిబంధనలను  తప్పక పాటిస్తూ క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ, ఉన్నతాధికారులకు తగిన సమాచారం అందించాలని చెప్పారు.

 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలి 

ఎన్నికల ప్రక్రియ వలరబుల్ మ్యాపింగ్ ద్వారా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించడంతో ఎన్నికల విధులు మొదలుపెట్టాలని,  సెక్టార్ అధికారులను కలెక్టర్  ఆదేశించారు. ఆయా గ్రామాలలోని పోలింగ్ కేంద్రాల పరిధిలోని పెద్దలతో సమావేశం నిర్వహించి ఓటర్లు  ఎటువంటు ప్రలోభాలకు లొంగకుండా  అమూల్యమైన  ఓటును  వినియోగించుకునేలా  అవగాహనా సదస్సులు  ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, కోడ్ అమలులోకి రాగానే  నిర్వహించే విధుల పట్ల పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. 

ఎన్నికల ప్రవర్తన నియమావళి  పకడ్బందీగా అమలులో భాగంగా మద్యం, డబ్బు అక్రమ పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు మాదిరిగానే పార్లమెంటు ఎన్నికలను  సైతం సమర్థవంతంగా పూర్తి చేయుటకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి వల్లూరు పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి, విధులు, ఏర్పాట్లు, తదితర విషయాలపై జిల్లా స్థాయి ట్రైనర్ కృష్ణ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, DMWO దేవుజ, ఆర్డీవోలు రవీందర్ రెడ్డి,  వెంకటేశ్వర్లు, రాజు, పాండు, ఇతర అధికారులు, వ్యయ పరిశీలకులు పాల్గొన్నారు.

.