సుపారితో మొదటి భార్యను హత్య చేసిన భర్త : మెదక్ జిల్లాలో ఘటన

తెలంగాణ ప్రభ (మెదక్): ఇద్దరు భార్యల మధ్య నెలకొన్న గొడవలతో వేగలేక మొదటి భార్య అడ్డు తొలగించుకోవాలని ఇరవై వేలు ఇచ్చి తాళి కట్టిన ఇల్లాలిని భర్త హత్య చేయించాడు. ఈ ఘటన

మెదక్ జిల్లా తొగిటలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మెదక్ రూరల్ సీ.ఐ కేశవులు బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో

వెల్లడించారు. హవేళి ఘనపూర్ మండలం తొగిటకు చెందిన మంద సంగమణి ఈనెల 11న అర్ధరాత్రి దారుణ హత్యకు గురైంది. మృతురాలు భర్త ఆశయ్యకు సంగమణి మొదటి భార్య కాగా రెండో భార్య మంజుల కూడా ఉంది. ఇద్దరి భార్యల మధ్య సంసారం విషయంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. అంతే కాకుండా కొత్తగా కట్టుకున్న ఇల్లు గురించి, పొలాలు, ఆస్తుల విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అందులోను ఆశయ్య రెండో భార్య

మంజులతో కలిసి ఉండటం సంగమణికి నచ్చలేదు. దీంతో గొడవలు ఇంట్లో పెరిగిపోయాయి. నిత్యం ఇంట్లో జరిగే గొడవల మూలంగా ఆశయ్యకు తలనొప్పిగా మారి మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంట్లో జరిగే గొడవలు తగ్గాలంటే ఎలాగైనా తన మొదటి భార్య సంగమణిని చంపాలని భావించాడు. ఇందుకోసం పథకం రూపొందించి మాచబోయిన మహేష్ తో హత్యకు పథకం వేశాడు. సంగమణిని హత్య చేస్తే రూ.20 వేలు ఒప్పందం చేసుకున్నాడు. పథకంలో భాగంగా ఆశయ్య, రెండో భార్యతో కలిసి బంధువుల ఊరికి వెళ్ళగా ఫిబ్రవరి 11న రాత్రి సమయంలో మహేష్, శివకుమార్ తో కలిసి ఆశయ్య చెప్పినట్టుగా ఇంట్లో ఒంటరిగా ఉన్న సంగమణి వద్దకు వచ్చారు. ఇంటి వంట గది నుంచి పొగ బయటకు వెళ్ళడానికి ఏర్పాటు చేయబడిన రంధ్రం నుంచి లోపలికి వెళ్ళారు. నిద్రలో ఉన్న సంగమణిని కత్తిపీటతో బలంగా ఆమె గొంతు పైన నరికినట్టు చెప్పారు. రక్తపు మడుగులో పడివున్న ఆమె చనిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత మహేష్, శివకుమార్ లు కలిసి బెడ్ రూంలో బ్యాగులో నుంచి రూ.20 వేలు, సంగమణి కుడి చెవి కమ్మను తీసుకొని, ఆమె మెడలో ఉన్న నల్ల పూసల గొలుసులోని పుస్తె తెంపుకొని వెళ్ళిపోనట్టు వివరించారు. విచారణలో ఆమె భర్త భార్య హత్యకు ప్లాన్ వేసిన విషయాన్ని నిర్ధారించి ఇందుకు కారణమైన వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మెదక్ రూరల్ సీఐ కేశవులు తెలిపారు. హత్య మిస్టరీని చేధించిన హవేళి ఘనపూర్ ఎస్.ఐ ఆనంద్ గౌడ్, సిబ్బందిని అభినందించారు.

.