సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి భాగస్వాములు కావాలి

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

తెలంగాణ ప్రభ ( ఉమ్మడి మెదక్ బ్యూరో ):కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు , సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధులు అందజేసి జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పరిశ్రమల ప్రతినిధులను కోరారు. బుధవారం క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు సిఎస్ఆర్ నిధుల జిల్లా పర్యవేక్షణ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కంపెనీ ఆక్ట్ మేరకు సామాజిక బాధ్యతగా జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులను అందించి సహకరించాలన్నారు. సిఎస్ఆర్ నిధుల వినియోగంలో స్థానికంగా కంపెనీ ఉన్న ప్రాంతానికి, జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆయా కంపెనీలకు గత ఐదు సంవత్సరాలలో వచ్చిన ప్రాఫిట్ సిఎస్ఆర్ కింద జిల్లాలో వెచ్చించిన నిధులకు సంబంధించి వివరాలు అందించాలని తెలిపారు. పరిశ్రమలు తమ నెట్ ప్రాఫిట్ లో రెండు శాతం సిఎస్ఆర్ కింద నిధులు జిల్లాలో విద్య, వైద్యం కోసం ఇవ్వాల్సి ఉంటుందని, కంపెనీ వారీగా ఇప్పటివరకు ఎంత ఇచ్చారు? ఇంకా ఎంత ఇవ్వాల్సి ఉందన్నది,  ప్రతి సంవత్సరం వారి వివరాల నివేదికను సిఎస్ఆర్ నోడల్ అధికారులు అందించాలని ఆమె సూచించారు. పరిశ్రమలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల అవసరాలను గుర్తించి ఆ మేరకు సౌకర్యాలను కల్పించేందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో  జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ప్రశాంత్,  జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.వేంకటేశ్వర్లు,  పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజేశ్వర్, బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్, ఎస్టీ వెల్ఫేర్ అధికారి ఫిరంగి, ఎస్సీ వెల్ఫేర్ అధికారి అఖిలేశ్వర్ రెడ్డి,  ఎక్సైజ్ అధికారి నవీన్ చందర్   జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

.