రైతులు ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి : వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

సింగీతంలో రెండున్నర కోట్లతో పీహెచ్ సీకి శంకుస్థాపన

తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో): ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన ఎత్తిపోతల పథకాలను రైతులు పార్టీలకతీతంగా కమిటీని ఏర్పాటు చేసుకొని మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ అన్నారు. ప్రభుత్వం రైతుల సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతల పథకంను  ఏర్పాటు చేసి ఇస్తుందని,  ఎత్తిపోతల పథకం ఆలనాపాలన చూడాల్సిన బాధ్యత రైతులదని అన్నారు.

గత 12 సంవత్సరాల క్రితం 18 కోట్ల రూపాయలతో నిర్మించిన బోగులంపల్లి ఎత్తిపోతల పథకంను పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరిందని,  మోటార్లు దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. రైతుల శ్రేయస్సు కోసం తిరిగి ఎత్తిపోతల పథకం నడవడానికి వీలుగా రాయికోడ్ మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన 1250 మంది రైతుల 2600 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడానికి రెండు కోట్ల 16 లక్షలతో ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులు అదనపు గ్రావిటీ పైప్ లైన్ లో ఏర్పాటుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. నెల రోజుల్లో ఈ పనులన్నీ పూర్తవుతాయని ఈ ఎత్తిపోతల పథకం సవ్యంగా పనిచేయాలంటే ఆరు గ్రామాలకు చెందిన రైతులు కలిసి కమిటీని ఏర్పాటు చేసుకొని కమిటీ ద్వారా ఎత్తిపోతల పథకంను నడిపించాలన్నారు.

ఎత్తిపోతల పథకానికి సంబంధించిన 1250 మంది రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అవసరమైతే తాను కూడా సమావేశానికి వస్తానని తెలిపారు. 

త్వరలో భుదేరా నుండి సిరూరు వరకు రెండు లైన్ల ఆర్ అండ్ బి రోడ్డు ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ రోడ్డు ఏర్పాటుతో రాయికోడ్ మండలంలోని సింగూరు తీర గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఈ సందర్భంగా సింగీతం   గ్రామంలో రూ.2.5 కోట్లు, రాయికోడ్ ఎక్స్ రోడ్ వద్ద 20 లక్షలతో ఎన్ హెచ్ ఎం నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కర్చల్ సబ్ స్టేషన్ నుండి  బొంగులంపల్లి ప్రాజెక్టు వరకు 30 లక్షలతో మెటల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అల్లపూర్ నుండి షాంశుద్దీన్ పూర్ వరకు 70 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

రాయికొడ్ లోని మోడల్ స్కూల్ వద్ద సిసి రోడ్ల నిర్మాణానికి మార్కెట్ కమిటీ నిధులతో చేపట్టనున్న మెటల్ రోడ్డు నిర్మాణానికి, రాయికోడ్ ఎక్స్ రోడ్ వద్ద విద్యుత్ సబ్స్టేషన్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి ,  ఎస్ఈ ఇరిగేషన్ మురళీధర్,  డిఎంహెచ్వో గాయత్రి , జహీరాబాద్ ఆర్డీవో రాజు,  ఎంపీపీ లత, జడ్పిటిసి మల్లిఖార్జున్ రెడ్డి, ప్రిన్సిపల్ రజిని కుమారి,  ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు  పాల్గొన్నారు.

.