సాదాబైనామా దరఖాస్తుదారులకు నిరాశే
ఉమ్మడి మెదక్ జిల్లాలో 25వేలకు పైగా దరఖాస్తులు
తెలంగాణ ప్రభ (ఉమ్మడి మెదక్ బ్యూరో): గతంలో తెల్లకాగితాలపై రాసుకొని భూముల క్రయవిక్రయాలు చేసుకున్న సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. అర్హులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ విస్తృత ప్రచారం చేశారు. క్రమబద్దీకరణ కోసం రెండేళ్ల కిందట దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన పూర్తి చేశారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ ముందుకు కదలడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు 25వేల పైచిలుకు దరఖాస్తులు అందాయి. ప్రస్తుతం ఆర్జీలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. కాగా సంగారెడ్డి జిల్లాలో సాదాబైనామాల క్రమబద్దీకరణ దరఖాస్తులు అత్యధికంగా ఆందోల్ మండలం నుంచే వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 8,012 దరఖాస్తులు అందగా ఇందులో ఆందోల్ మండలానికి చెందినవే 1,157 ఉన్నాయి. జిల్లాలోని మిగతా ఏ మండలంలోనూ దరఖాస్తుల సంఖ్య వెయ్యి దాటలేదు. రామచంద్రాపురం మండలంలో అత్యల్పంగా 47 దరఖాస్తులు వచ్చాయి. పట్టా భూములకు సంబంధించి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీ పరిధిలోని మండలాలకు మొదట సాదాబైనామాల క్రమబద్దీకరణ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోని మండలాలకు సైతం అవకాశం ఇచ్చినా స్పందన అంతంతమాత్రంగా వచ్చింది. కాగా జీహెచ్ఎంసీ పరిధిలోని గుమ్మడిదల నుంచి 221, జిన్నారం 288, హత్నూర 831, సంగారెడ్డి 153, కంది 345, పటాన్‌చెరు 157, అమీన్‌పూర్ 50, రాంచంద్రాపురం మండలం నుంచి 50లోపు దరఖాస్తులు వచ్చాయి. ఇలావుండగా జిల్లాలోని ఆందోల్ డివిజన్ వ్యాప్తంగా 2,496, జహీరాబాద్ డివిజన్‌లో 1,123, నారాయణఖేడ్ డివిజన్‌లో 1,320, సంగారెడ్డి డివిజన్ వ్యాప్తంగా 3,073 దరఖాస్తులు వచ్చాయి.
పథకాలు అందక అవస్థలు..:
భూమి సాగుచేస్తున్నా హక్కులు మాత్రం లేవు. పెట్టబడి సాయం, రైతుబీమా వంటి పథకాలు కూడా వర్తించడం లేదు. సాదాబైనామా పద్దతిలో భూములు కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఇది. చట్టబద్దత కల్పించే క్రమంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన గత ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో దరఖాస్తుదారులకు ఎదురుచూపులే మిగిలాయి. కొత్త ప్రభుత్వమైనా ఈ అంశంపై దృష్టి సారించి సాదాబైనామాలకు చట్టబద్దత కల్పించి పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
