కొత్త ప్ర‌భుత్వంలో అన్నీ స‌మ‌స్య‌లే : ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ

జీహెచ్ఎంసీ కౌన్సిల్ స‌మావేశంలో ధ్వ‌జ‌మెత్తిన ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ

తెలంగాణ ప్ర‌భ (శేరిలింగంప‌ల్లి): కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత జీహెచ్ఎంసీ కౌన్సిల్ తొలి సమావేశాన్ని సోమ‌వారం కౌన్సిల్ హాల్ లో నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నెలకొన్న పలు సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కౌన్సిల్‌లో వెల్ల‌డించారు. ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకునే  ప్రభుత్వం ప్రజలకు కనీస అవసరాలు కల్పించలేకపోతుందని, కాలయాపన చేస్తూ అభివృద్ధిని విస్మరిస్తుందని ఎమ్మెల్యే విమ‌ర్శించారు. గత 3 నెలల నుండి కాలనీలలో సరిగ్గా  వీధి దీపాలు లేవని, పారిశుధ్యం, రోడ్డు, డ్రైనేజీ వంటి పనులు చేయకుండా వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కొత్త‌గా ఐఏఎస్ అధికారులను జోనల్ కమిషనర్లుగా నియమించడం జరిగినదని కానీ వారికి ఒక్క  రూపాయి పనిలేని వ్యవస్థను అప్పజెప్పారని, వారికి నిధులు మంజూరు చేయకుండా చేస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుతం హయాంలో నిర్వహణకు నెలకు 8 కోట్ల నిధులు మంజూరు అయ్యేవని ఇప్పడు 4 కోట్లు కూడా విడుదల చేయకుండా కాల‌యాప‌న చేస్తున్నార‌ని ఎమ్మెల్యే విమ‌ర్శించారు. ఒక ప్రణాళిక బద్దంగా పనిచేయకుండా, ప్రజా సమస్యలను పరిష్కరించకుండా కొంత మంది అధికారుల తీరుపై తీవ్ర  అసహనం వ్యక్తం చేశారు. ఇప్ప‌టికైనా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరారు.

.