ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకోవాలి

అమ్మాయిల చదువుతూనే సమాజంలో మార్పు

రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ్మ‌

తెలంగాణ ప్ర‌భ ( ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో ): అమ్మాయిల చ‌దువుతోనే స‌మాజంలో మార్పు జ‌రుగుతుంద‌ని, ప్ర‌తి ఒక్క‌రు ఉన్న‌త ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకోవాల‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ్మ తెలిపారు. సోమ‌వారం ఆయ‌న సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్, చౌటుకూర్ మండలాలలోని శివ్వంపేట పాలిటెక్నిక్ కళాశాల, సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.430.77 లక్షలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా కళాశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంలో తాను ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, మహిళా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో మంజూరు చేసినట్లు తెలిపారు. శివ్వంపేట పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల మెరుగు కోసం తన వంతు కృషి చేసినట్లు తెలిపారు .కళాశాలలో ప్రహారీ గోడ, సీసీ రోడ్ల నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు . త్వరలో కళాశాలకు బాలికల వసతిగృహం, ప్రయోగశాలల ఏర్పాటుకు, మౌలిక వస్తువుల మెరుగుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయనున్నట్లు  తెలిపారు. మహిళలు ఉన్నత విద్యావంతులైతే సమాజంలో మార్పు వస్తుందన్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాలను నిర్ణయించుకోవాలన్నారు. సమాజ అభివృద్ధిలో విద్యార్థులు భాగ‌స్వామ్యం కావాల‌న్నారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ఆయా కళాశాలలోనెలకొన్న సమస్యలను ప్రాధాన్యత‌ పరంగా మంత్రి సహకారంతో పరిష్కరించనున్నట్లు తెలిపారు.  విద్యార్థులు ఉన్నత విద్యావంతులై సమాజాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అంతకుముందు మంత్రి, జిల్లా పరిషత్  చైర్ పర్సన్, జిల్లా కలెక్టర్ , వైస్ ఛాన్సలర్  లతో కలిసి జేఎన్టీయూ కళాశాలలో ఉమన్  అనాటమీ , ఫిజియాలజీ , ఫార్మాలజీ  ల్యాబ్ ,  అడ్వాన్స్ కంప్యూటర్ ల్యాబ్,  ఆర్టిఫిషియల్ - ఇంటలీజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్ లను  ప్రారంభించారు.  

అనంతరం ఆందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలోని ప్రతిపాదిత నర్సింగ్ కళాశాల 150 పడకల ఆసుపత్రి నిర్మాణ స్థలాన్ని రాష్ట్ర వైద్య  విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ కార్యకమాలలో  జిల్లా పరిషత్  చైర్మన్ పి.మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జెఎన్‌టీయు వైస్ ఛాన్సలర్  కట్టా నర్సింహారెడ్డి,  ఆందోల్ ఆర్డీవో పాండు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

.